1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:34 AM
రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి భద్రత, ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దురదృష్టవశాత్తు, అకస్మాత్తుగా ఇంటి పెద్ద మరణిస్తే సదరు కుటుంబం ఆర్థికంగా ....
ఇంటి పెద్ద మరణిస్తే రూ.5 లక్షల బీమా
జూన్ 2వ తేదీ నుంచి పథకం ప్రారంభం
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి భద్రత, ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దురదృష్టవశాత్తు, అకస్మాత్తుగా ఇంటి పెద్ద మరణిస్తే సదరు కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న భావనతో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని తీసుకురాబోతోంది. ఈ పథకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ప్రారంభించాలని నిర్ణయించగా, పథకం కోసం ఈ బడ్జెట్‌లో రూ.4వేల కోట్లను కేటాయించింది. ఇంటిపెద్ద చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందించనుంది. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు బీమా పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. కాగా ఈ పథకం కోసం కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకోనున్నారని, ఇంటి పెద్దకే బీమాను వర్తింపచేసే అవకాశాలున్నట్టు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. అలాగే రాష్ట్రంలో రేషన్‌కార్డులు కలిగి ఉన్న కుటుంబాలనే అర్హులుగా గుర్తించనున్నట్టు సమాచారం. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం ఉండబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రైతు బీమా రద్దవుతుందా?
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రకటనతో రైతుబీమా పథకం రద్దవుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికి పైగా రైతులకు రైతుభరోసా పథకం కింద ఆర్థిక సాయం అందుతుండగా, ఇందులో 42 లక్షల మందికి రైతు బీమా పథకం వర్తిస్తోంది. అంతేకాకుండా భూమి ఉండి, అర్హత ఉండి, ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ రైతుబీమా పథకం అమలవుతోంది. ఈ పథకం కింద ఎవరైనా రైతు అకస్మాత్తుగా మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. గత(2025-26) బడ్జెట్‌లో రైతుబీమా పథకానికి రూ.1167 కోట్లను కేటాయించగా, ఈసారి నిధులు కేటాయించలేదు. దీంతో రైతు బీమాను రద్దు చేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రైతుబీమా పథకాన్ని జీవిత బీమా పథకం కిందకు తీసుకువచ్చినట్లయుతే.. ఒకే ఇంట్లో ఇద్దరికి పాసుపుస్తకాలు ఉండి, వారిద్దరూ రైతుబీమా కింద అర్హులై ఉంటే.. అప్పుడు ఆ ఇద్దరిలో ఎవరికి బీమా అందుతున్న ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
హైదరాబాద్ భద్రతకు భారీగా నిధులు
శాంతిభద్రతల విభాగానికి ప్రభుత్వం రూ.11,907 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.10,135కోట్లతో పోలిస్తే హోంశాఖకు రూ.1772 కోట్ల బడ్జెట్ కేటాయింపులు పెంచారు. దాదాపు 17శాతం పెరుగుదల కన్పించింది. అర్బన్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ 4 కమిషనరేట్లకు రూ.3,781కోట్లు కేటాయించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌తో పాటు, హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్లకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు.
పంచాయతీరాజ్ శాఖకు 33,688 కోట్లు
వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33,688 కోట్లు కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సర మొత్తం బడ్జెట్‌లో ఇది 10 శాతంకంటే ఎక్కువే. గతేడాది ఈ శాఖకు రూ.31,605 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2,083 కోట్లు పెంచారు.