Share News

ప్రతి కుటుంబానికీ ‘ఇందిరమ్మ బీమా’

ABN , Publish Date - May 25 , 2026 | 05:10 AM

రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి పేద, ధనిక, కుల, మతం అనే భేదం లేకుండా కోటి 15 లక్షల కుటుంబాలకి ‘ఇందిరమ్మ బీమా పథకాన్ని’ అమలు చేయనున్నట్లు ఉప ....

ప్రతి కుటుంబానికీ ‘ఇందిరమ్మ బీమా’

  • కోటి 15లక్షల కుటుంబాలకు ప్రయోజనం

  • జూన్‌ 2 నుంచి ప్రారంభిస్తున్నాం: భట్టి విక్రమార్క

  • పంటల కొనుగోళ్లపై స్పందించని కేంద్రం: తుమ్మల

ఖమ్మం కలెక్టరేట్‌/హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి పేద, ధనిక, కుల, మతం అనే భేదం లేకుండా కోటి 15 లక్షల కుటుంబాలకి ‘ఇందిరమ్మ బీమా పథకాన్ని’ అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకంలో అన్ని కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమాను వర్తింప జేస్తున్నామన్నారు. జూన్‌ 2వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నటు వెల్లడించారు. సుడా చైర్మన్‌గా ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, గ్రంథాలయ చైర్మన్‌ ఎండీ ఖాదర్‌బాబా పదవీ స్వీకారం చేపట్టిన సందర్భంగా ఆదివారం ఖమ్మం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి తుమ్మల తదితరులు పాల్గొ న్న ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రజల అవసరాల్ని పక్కన పెట్టి, కేవలం కేసీఆర్‌కి సంబంధించిన కుటుంబ అవసరాల కోసమే పనిచేశారని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. కాగా, కనీస మద్దతు ధరల ప్రకటనలకే కేంద్ర ప్రభుత్వం పరిమితమవుతున్నదని, పంట ఉత్పత్తుల కొనుగోళ్లుపై ఏమాత్రం స్పందించటంలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సర్దుబాటుచేసి కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నదని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - May 25 , 2026 | 05:10 AM