గర్భాశయ క్యాన్సర్‌పై ‘టీకా’ అస్త్రం
ABN , Publish Date - Mar 05 , 2026 | 02:24 AM
మహిళల ప్రాణాలను హరిస్తున్న గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారకమైన హ్యూమన్ పాపిలోమా వైరస్....
మహిళా దినోత్సవం నుంచే హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ
14 ఏళ్ల బాలికలకు ఉచితంగా..
వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మహిళల ప్రాణాలను హరిస్తున్న గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారకమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వైర్‌సను అడ్డుకోవడమే లక్ష్యంగా.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున టీకా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హెచ్‌పీవీ టీకాలను మార్చి 8న అధికారికంగా పంపిణీని చేయనున్నారు. ఈ మేరకు బుధవారం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీతా సత్యనారాయణ జిల్లాల వైద్యాధికారులకు స్పష్టమైన ఆదేశాలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో రెండు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశను ఈ నెల 8 నుంచి ప్రారంభించి 3నెలల పాటు (90 రోజులు) ‘క్యాంపెయిన్ మోడ్’లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత దీనిని సాధారణ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్‌లో విలీనం చేస్తారు. అప్పటి నుంచి ప్రతి బుధవారం, శనివారం ఆస్పత్రుల్లో ఈ టీకా అందుబాటులో ఉంటుంది. తొలి 30 రోజుల పాటు వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని బోధనాస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రులో టీకాలు వేస్తారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వీటిని అందిస్తారు. 14 ఏళ్లు నిండిన బాలికలకు ‘గార్డాసిల్ 4’ వ్యాక్సిన్‌ను సింగిల్ డోస్‌గా ఎడమ చేతికి ఇస్తారు. అనంతరం, ఎడమ చేతి చూపుడు వేలికి ఇంకు గుర్తు పెట్టి, ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. టీకా పొందాలనుకునే వారు ‘యూ-విన్’ పోర్టల్ ద్వారా లేదా నేరుగా ఆస్పత్రికి వెళ్లి రిజిరేస్టషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం వంటివి వెంట తీసుకెళ్లాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులకు కమిషనర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. బాలికలకు టీకా వేయాలంటే తల్లిదండ్రుల లేదా సంరక్షకుల లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి చేశారు. ఖాళీ కడుపుతో టీకా తీసుకోకూడదని అల్పాహారం లేదా భోజనం చేసిన తర్వాతే రావాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. టీకా వేసిన తర్వాత అరగంట పాటు ఆస్పత్రిలో ఉండాలని సూచించారు. హెచ్‌పీవీ టీకాపై ఎలాంటి అపోహలు వద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2006 నుంచి ఇది వాడుకలో ఉందని, గర్భాశయ క్యాన్సర్ నివారణలో ఇది 93 శాతం సమర్థంగా పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు.