Share News

100 రోజుల ఆరోగ్య మిషన్‌

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:55 AM

రాష్ట్రంలో ద్వాక్రా మహిళల సంపూర్ణ ఆరోగ్య వివరాలు సేకరించి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం.....

100 రోజుల ఆరోగ్య మిషన్‌

  • మార్చి 2 నుంచి జూన్‌ 9 వరకు ‘హెల్త్‌ మిషన్‌- 100’

  • 42 లక్షల మంది డ్వాక్రా మహిళల డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ రూపకల్పన

  • ఉచితంగా 30 రకాల వైద్య పరీక్షలు..

  • క్యాన్సర్‌, వేసవిలో వచ్చే జబ్బులు, పాలీ క్లినిక్స్‌పై ప్రత్యేక దృష్టి

  • వైద్య శాఖ అధికారులతో మంత్రి దామోదర సన్నాహక భేటీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ద్వాక్రా మహిళల సంపూర్ణ ఆరోగ్య వివరాలు సేకరించి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ‘హెల్త్‌ మిషన్‌-100’ పేరుతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మార్చి 2 నుంచి జూన్‌ 9 వరకు నాలుగు దశల్లో నిర్వహించే ఈ 100 రోజుల కార్యక్రమంలో రాష్ట్రంలోని 42 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యత తనిఖీలు నిర్వహిస్తారు. విజన్‌ 2047లో భాగంగా వైద్యారోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, గిరిజనులే లక్ష్యంగా ఈ మిషన్‌ కొనసాగుతుంది. రాబోయే వందరోజుల్లో చేయబోయే పనుల జాబితాను వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. 42 లక్షల మంది డ్వాక్రా మహిళలకు సెర్ప్‌, వైద్యారోగ్య శాఖ సంయుక్తంగా టీ-డయాగ్నోస్టిక్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా 30 రకాల వైద్యపరీక్షలు నిర్వహించి, వారి హెల్త్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తారు. భవిష్యత్తులో వారికి ఏ జబ్బు చేసినా, వారి ఆరోగ్య చరిత్ర మొత్తం వైద్యుల చేతిలో ఉండేలా ఈ డేటా పనికొస్తుంది. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో క్వాలిటీ ఆడిట్‌ నిర్వహించనున్నారు.


నాలుగు దశలు.. భిన్న సేవలు

మార్చి 2 నుంచి 31 వరకు నిర్వహించే మొదటి దశలో తల్లీబిడ్డలు, వృద్ధుల ఆరోగ్యంపై దృష్టి పెడతారు. టీచింగ్‌, టీవీవీపీ ఆస్పత్రుల నుంచి గైనకాలజీ, చిన్నపిల్లల, కంటి, పంటి, ఎముకల డాక్టర్లు గ్రామాల్లోని పీహెచ్‌సీలకు వెళ్లి సేవలందిస్తారు. మార్చి 19న సనత్‌నగర్‌ టిమ్స్‌ను ప్రారంభిస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు నిర్వహించే రెండో దశలో క్యాన్సర్‌ను ‘నోటిఫైడ్‌ డిసీజ్‌’గా గుర్తించే అవకాశం ఉంది. క్యాన్సర్‌ కేర్‌ పాలసీని ప్రారంభించి, క్యాన్సర్‌ రిజిస్ర్టీని ఏర్పాటు చేస్తారు. ఆరోగ్య మహిళ కేంద్రాల్లో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ క్యాంపులు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 16 నుంచి మే 15 వరకు ఉండే మూడో దశలో ఎండలు, అంటువ్యాధులపై దృష్టి పెడతారు. హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి, వనస్థలిపురం, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా 5 హీట్‌ స్ర్టోక్‌ రూమ్స్‌ను అందుబాటులోకి తెస్తారు. మే 16 నుంచి జూన్‌ 9 వరకు నిర్వహించే నాలుగో దశలో పట్టణ, గిరిజన ఆరోగ్యంపై దృష్టి పెడతారు. పట్టణాల్లోని 145 అర్బన్‌ పీహెచ్‌సీలను పాలీక్లినిక్స్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్‌ సెల్‌ ఎనీమియా, తలేసమియా, హీమోఫీలియా బాధితులను గుర్తిస్తారు. ఈ ఫేజ్‌లోనే అల్వాల్‌ టిమ్స్‌తోపాటు వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తారు.

Updated Date - Feb 27 , 2026 | 04:55 AM