గర్భిణుల్లో రక్తహీనతకు చెక్
ABN , Publish Date - May 18 , 2026 | 02:54 AM
రాష్ట్రంలో గర్భిణుల్లో రక్తహీనత (ఎనీమియా) సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు.....
ప్రభుత్వాస్పత్రుల్లో ‘ఎఫ్‌సీఎం’ థెరపీకి ఏర్పాట్లు
రక్తహీనత నివారణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించిన ప్రభుత్వం
రాష్ట్రంలోని 52శాతం గర్భిణుల్లో రక్తహీనత
హైదరాబాద్, మే 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గర్భిణుల్లో రక్తహీనత (ఎనీమియా) సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు ‘ఫెర్రిక్ కార్బాక్సి మాల్టోస్ (ఎఫ్సీఎం)’ థెరపీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ థెరపీ అందుబాటులోకి వస్తుండటం ఇదే తొలిసారి. తెలంగాణలో సగటున ఏటా 6.5లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం తెలంగాణలో 52.2 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువ. ఈ క్రమంలోనే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ‘4టీ (టెస్ట్, ట్రీట్, టాక్, ట్రాక్)’ పేరిట ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వయసుల వారికి ఎనీమియాపై అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు ఆస్పత్రి లో పేరు నమోదు చేసుకోగానే రక్త పరీక్ష లు (స్ర్కీనింగ్) చేసి, రక్తహీనతను ప్రాథమిక దశలోనే గుర్తిస్తారు. ఏఎన్‌ఎం ప్రతి గర్భిణికి ప్రసవ సమయానికి ముందు కనీసం 4 సార్లు, రక్తహీనతతో బాధపడుతున్నవారికి ఆరుసార్లు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణ గర్భిణులకు 180 ఐరన్-ఫోలిక్ యాసిడ్ మాత్రలను.. రక్తహీనత ఉన్నవారికి 360 మాత్రల ను అందిస్తారు. మధ్యస్థ రక్తహీనత ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ‘ఐరన్ సుక్రోజ్ థెరపీ’ చికిత్సను అందిస్తారు. సీహెచ్‌సీ, ఆపై స్థాయి ఆస్పత్రుల్లో నిపుణుల సలహా మేరకు ‘ఫెర్రిక్ కార్బాక్సి మాల్టోస్’ చికిత్సను అందుబాటులోకి తెచ్చారు.
ఏమిటీ ఎఫ్‌సీఎం థెరపీ?
రక్తహీనత తీవ్రంగా ఉన్నప్పుడు, మాత్రల ద్వారా లోపాన్ని సరిచేయలేనప్పుడు.. నేరుగా సెలైన్ ద్వారా ‘ఫెర్రిక్ కార్బాక్సి మాల్టోస్ (ఎఫ్‌సీఎం)’ను శరీరంలోకి ఎక్కిస్తారు. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో రక్తం పరిమాణం పెరుగుతుంది. కడుపులో బిడ్డ ఎదుగుదలకు అదనంగా ఐరన్ కావాలి. దీని తో గర్భిణుల్లో ఐరన్‌లోపం ఏర్పడి రక్తహీనత సమస్య తలెత్తుతుంది. తొలినాళ్లలో ఐరన్ మాత్రల ద్వారా సమస్యను కొంతమేర సరిదిద్దవచ్చు. అయితే ఐరన్ మాత్రల కారణంగా చాలా మంది గర్భిణుల్లో వికారం, వాంతులు, మలబద్థకం, కడుపునొప్పి వంటి దుష్పరిణామాలు ఏర్పడుతుంటాయి. కొంత మందిలో ఆహారం, మాత్రల ద్వారా వచ్చే ఐరన్‌ను శరీరం సరిగ్గా సంగ్రహించుకోలేక పోతుంది. ప్రసవానికి సమయం దగ్గరపడుతున్నప్పుడు హెమోగ్లోబిన్ స్థాయిలను పెం చడానికి మాత్రలు ఉపయోగపడవు. అలాం టి వారందరికీ ఎఫ్‌సీఎం థెరపీ ద్వారా కొన్ని రోజుల్లోనే ఐరన్ స్థాయిలు పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఒకే సిట్టింగ్‌లో (గరిష్టంగా 15-30 నిమిషాల్లో) ఎక్కువ మోతాదులో (1000ఎంజీ వరకు) సురక్షితం గా ఇవ్వవచ్చు. ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో సెలైన్‌లో కలిపి ఎఫ్‌సీఎం ఎక్కిస్తారు.
తీవ్ర రక్తహీనతతో ప్రాణాపాయం
గర్భిణులకు ఐరన్ స్థాయులు తగ్గితే రక్తహీనత సమస్య వస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయి 7 గ్రాముల కన్నా తగ్గితే తీవ్ర రక్తహీనత (ఎనీమియా)గా పరిగణిస్తాం. దీని వల్ల కొన్నిసార్లు మావి ముందే ఊడిపోతుంది. ప్రాణాపాయంకూడా. పుట్టబోయే బిడ్డకు సైతం రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. అందుకే సిఫారసు చేస్తాం. ఎఫ్‌ఎసీఎంతో నెల రోజుల్లో ఒక గ్రాము హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
- డాక్టర్ వెల్లంకి జానకి, ప్రొఫెసర్ గైనకాలజీ, గాంధీ ఆస్పత్రి, హైదరాబాద్.