క్యూర్ పాలనా వ్యవస్థ సిద్ధం!
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:09 AM
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో అత్యంత కీలకమైన పాలనా వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్...
సీఎం నేతృత్వంలో అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్
హైదరాబాద్ మహానగర పరిధిలోని కీలక రంగాలపై నిర్ణయాలు ఇక ఈ కౌన్సిల్‌వే
అమలుకు క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
మునిసిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సారథ్యం
హైదరాబాద్ సిటీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో అత్యంత కీలకమైన పాలనా వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ , ఎగ్జిక్యూటివ్ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు క్యూర్ బిల్లులో వీటికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం.. ఈ రెండు కమిటీలు భవిష్యత్తులో హైదరాబాద్ మహానగర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్, విపత్తుల నిర్వహణ, విద్యుత్, తాగునీరు, రవాణా, మునిసిపల్ సేవలు వంటి కీలక రంగాలపై ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే అత్యున్నత వేదికలుగా పని చేస్తాయి. క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్‌కు ముఖ్యమంత్రి చైర్మన్‌గా, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సభ్యుడిగా, అదే శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి సంబంధిత శాఖల మంత్రులను ప్రత్యేక సభ్యులుగా ఆహ్వానించే అధికారం చైర్మన్‌కు ఉంటుంది. అలాగే వివిధ రంగాల నిపుణులు, అధికారులు, ఇతర ప్రముఖులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించే వెసులుబాటును కూడా బిల్లులో కల్పించారు.
కోర్ అభివృద్ధికి దిశానిర్దేశం
క్యూర్ పరిధిలో సమగ్ర పట్టణ పాలనకు సంబంధించిన విజన్, విధానాలు, వ్యూహాలు, ప్రాధాన్యతలను నిర్ణయించే బాధ్యత అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్‌కు అప్పగించారు. కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధికి దీర్ఘకాలిక దిశానిర్దేశం ఇవ్వడం, సమగ్ర పట్టణ పాలనకు అవసరమైన విధానాలు, ప్రణాళికలు, కార్యాచరణలకు ఆమోదం తెలపడం, వివిధ శాఖల పథకాలు, పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాల మధ్య సమన్వయం తీసుకురావడం, సమర్థవంతమైన పట్టణ పాలనకు అవసరమైన ఇతర నిర్ణయాలు తీసుకోవడం వంటి బాధ్యతలు నిర్వహించనుంది.
అమలు బాధ్యత ఎగ్జిక్యూటివ్ కమిటీది
అపెక్స్ కౌన్సిల్ తీసుకునే నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యతలను క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్వహించనుంది. ఈ కమిటీకి మునిసిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మెట్రోపాలిటన్ కమిషనర్ కన్వీనర్‌గా ఉంటారు. క్యూర్ పరిధిలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ, హైదరాబాద్ వాటర్ బోర్డు ఎండీ, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ, ఆర్టీసీ ఎండీ, హైడ్రా కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అవసరమైతే ఇతర నిపుణులను ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీ సమావేశాలకు పిలిచే అధికారం కూడా చైర్మన్‌కు ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం కావడం తప్పనిసరి. అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో అదనపు సమావేశాలు కూడా నిర్వహించవచ్చు.