125 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే!
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:28 AM
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని సాగు భూములపై 125 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ సర్వే జరగనుంది.
పర్యవేక్షణకు 14 మంది అధికారులు.. హైదరాబాద్‌లో ప్రత్యేక డ్యాష్ బోర్డు
రెండు వారాలకోసారి ఉన్నతస్థాయి సమీక్ష
నవంబరు చివరి నాటికి తొలిదశ రీ సర్వే పూర్తి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని సాగు భూములపై 125 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ సర్వే జరగనుంది. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూ సర్వే పురోగతిపై శుక్రవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రీ సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు 7 జోన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో జోన్‌కు రెవెన్యూ, సర్వే విభాగాల నుంచి ఇద్దరు చొప్పున 14 మంది అధికారులను నియమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సర్వే తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తొలిదశలో 365 నక్షాలేని గ్రామాల్లో సర్వే చేపట్టామని, ఆ తర్వాత జిల్లాకు 70 గ్రామాల చొప్పున 2240 గ్రామాల్లో రీ సర్వే జరుగుతుందని వివరించారు. ఈ సర్వేలో మొదటి దశ సర్వే పనులు నవంబరు చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రతి మండలంలో కనీసం రెండు రెవెన్యూ గ్రామాల్లో సర్వే తప్పనిసరిగా చేపట్టేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కొ బృందంలో లైసెన్స్డ్ సర్వేయర్, జీపీవో, డిప్యూటీ తహసీల్దార్ లేదా ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉంటారని తెలిపారు. రీ సర్వేపై ప్రతి 15 రోజులకు ఒకసారి తానే స్వయంగా సమీక్ష చేస్తానని వెల్లడించారు. సర్వే జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి రోజూ తహసీల్దార్ పర్యటించి పని తీరును ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు.
రోజువారీ సర్వే జరిగే ప్రాంతాల వివరాలు, ఎంత విస్తీర్ణంలో పూర్తి చేశారు, సర్వే నంబర్లు ఎన్ని, ఎన్ని గ్రామాల్లో పని జరుగుతోంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది, సర్వేలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించాలని సూచించారు. చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా రీ సర్వే ఉండాలని ఆదేశించారు. రీ సర్వేను రాష్ట్ర స్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షించేలా హైదరాబాద్‌లో ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సర్వే పురోగతి, రోజువారీ పనితీరు, గ్రామాల వారీగా సర్వే పూర్తయిన వివరాలు, సాంకేతిక పరికరాలు, సిబ్బంది వివరాలన్నీ ఒకే చోట కనిపించేలా రియల్ టైమ్ టెక్నాలజీ వినియోగించాలని ఆదేశించారు. సర్వేకు అవసరమైన రోవర్లు, సర్వర్లు, ఇతర పరికరాలను కొనుగోలు చేసేందుకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. అవసరమైన చోట అదనపు రోవర్లు కొనుగోలు చేయాలన్నారు.
వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు
రీ సర్వే ముసుగులో ప్రజల నుంచి డబ్బు డిమాండ్ చేసినా, వసూళ్లకు పాల్పడినా ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలిసిన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎర్రవల్లిలో 385 ఎకరాల్లో 45 ఎకరాలు తక్కువ ఉందని, సర్వే కోసం మరోసారి నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఎర్రవల్లిలో అసైన్డ్ భూములు చేతులు మారాయని, వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అమరవీరులను గుర్తించి వాళ్లకు న్యాయం చేస్తామని తెలిపారు.