Share News

ప్రభుత్వ కోర్టు కేసుల ట్రాకింగ్‌కు సీసీఎంఎస్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:45 AM

వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కోర్టు కేసుల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం(ట్రాకింగ్‌), వాటిపై పర్యవేక్షణ, అందుకు సంబంధించిన విభాగాల సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకృత ....

ప్రభుత్వ కోర్టు కేసుల ట్రాకింగ్‌కు సీసీఎంఎస్‌

  • మొదట రెవెన్యూ, హోం, ఉన్నత విద్యాశాఖల్లో అమలు

  • సీసీఎంఎస్‌ పరిపాలనాధికారిగా సునీల్‌రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కోర్టు కేసుల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం(ట్రాకింగ్‌), వాటిపై పర్యవేక్షణ, అందుకు సంబంధించిన విభాగాల సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకృత డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కోర్ట్‌ కేస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(సీసీఎంఎ్‌స)’ను తీసుకొచ్చింది. ఏ శాఖ కోర్టు కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎప్పటిలోగా ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్లను దాఖలు చేయాలి, ఎలాంటి కోర్టు ఆదేశాలున్నాయి.. తదితర సమాచారాన్ని సంబంధిత శాఖల ముఖ్యకార్యదర్శులు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. తదనుగుణంగా శాఖ ల వారీగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సీఎస్‌ రామకృష్ణారావు సోమవారం జారీ చేశారు. సీసీఎంఎస్‌ ను మొ దట రెవెన్యూ, హోం, ఉన్నత విద్యా శాఖల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఐటీ శాఖతో సమన్వయం చేసుకుని, వెంటనే ఈ మూడు శాఖల్లో సీసీఎంఎస్‌ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రభుత్వం న్యాయశాఖను ఆదేశించింది. దీనిపై కాలానుగుణంగా పురోగతి నివేదికలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించాలని సూచించింది. మరోవైపు, సీసీఎంఎస్‌ పరిపాలనాధికారిగా సునీల్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు సీఎస్‌ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. సునీల్‌ రెడ్డి ప్రస్తుతం పులపాలకశాఖలో న్యాయవిభాగానికి ఓఎస్డీగా ఉన్నారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి వివిధ కోర్టుల్లో సుమారు 40వేల కేసుల వరకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో రెవెన్యూ, విద్య, హోం, వైద్యం, పరిశ్రమల శాఖలకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్నాయి.

బిహార్‌లో సీసీఎంఎస్‌ విజయవంతం

ప్రభుత్వ కేసుల ట్రాకింగ్‌కు, పర్యవేక్షణకు అవసరమైన కేంద్రీకృత వ్యవస్థ లేకపోవడం వల్ల కౌంటర్‌ అఫిడవిట్లను దాఖలు చేయడం, కోర్టు ఆదేశాలను సకాలంలో అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం బిహార్‌లో ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న కోర్టు మానిటరింగ్‌ వ్యవస్థను(సీసీఎంఎస్‌) అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆ వ్యవస్థను అధ్యయనం చేసి, తగిన సిఫారసులు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. న్యాయ, రెవెన్యూ, హోం శాఖల కార్యదర్శులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ కూడా సీసీఎంఎ్‌సను రాష్ట్రంలో అమలు చేయాలని సిఫారసు చేసింది. కాగా, తెలంగాణలో సీసీఎంఎ్‌సకు న్యాయ శాఖ నోడల్‌ శాఖగా వ్యవహరిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీసీఎంఎస్‌ విశేషాలు.

  • అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కేసులపై నిరంతర పర్యవేక్షణ వీలవుతుంది.

  • కోర్టు విధించిన గడువు, కౌంటర్‌ అఫిడవిట్ల దాఖలు, విచారణ తేదీల సమాచారమంతా సంబంధిత శాఖలు, ప్రభుత్వానికి సీసీఎంఎస్‌ ద్వారా ఆటోమేటిగ్గా అలర్ట్‌ల రూపంలో వచ్చేస్తుంది.

  • వ్యక్తిగత కేసుల పరిస్థితి, పురోగతిని కార్యదర్శులు, న్యాయ శాఖాధికారులు ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయవచ్చు.

  • కేసుల స్టేటస్‌, వాదనలు, తీర్పుల సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడానికి వీలవుతుంది.

Updated Date - Feb 10 , 2026 | 03:45 AM