ఇక పక్కాగా క్యాన్సర్ కేసుల లెక్క!
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:30 AM
తెలంగాణలో క్యాన్సర్ మహమ్మారిని కట్టడి చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించడంతోపాటు...
నోటిఫైడ్ డిసీజ్‌గా గుర్తిస్తూ జీవో జారీ
క్యాన్సర్ పోర్టల్‌ను ప్రారంభించిన వైద్యమంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో క్యాన్సర్ మహమ్మారిని కట్టడి చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించడంతోపాటు వ్యాధి వ్యాప్తిపై పక్కా సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో క్యాన్సర్‌ను ‘నోటిఫైడ్ డిసీజ్’గా గుర్తించింది. ఈమేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్థు మంగళవారం జీవో17 జారీ చేశారు. ఇకపై రాష్ట్రంలోని ఏ ఆస్పత్రి లేదా ల్యాబ్‌లో క్యాన్సర్ కేసు నిర్ధారణ అయినా వెంటనే ప్రభుత్వానికి నివేదించడం తప్పనిసరి చేశారు. క్యాన్సర్ బాధితుల సంఖ్య, వ్యాధి తీవ్రత ఏయే ప్రాంతాల్లో ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. క్యాన్సర్ నిర్ధారణ అయిన నెల రోజుల్లోగా సంబంధిత వివరాలను ప్రభుత్వం తీసుకొచ్చే పోర్టల్‌లో నమోదు చేయాలి. ఏ ఆస్పత్రి అయినా సమాచారాన్ని దాచినా, రిపోర్ట్ చేయడంలో ఆలస్యం చేసినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఆస్పత్రులన్నీ తప్పనిసరిగా ప్రత్యేక క్యాన్సర్ రిజిస్టర్‌ను నిర్వహించి ఎప్పటికప్పుడు డేటాను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ చేసే ల్యాబ్‌లు కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ కింద ఉన్న ఆస్పత్రులకు నేరుగా లాగిన్ ఐడీలు ఇవ్వగా, మిగిలిన సంస్థలు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. క్యాన్సర్ డేటా నిర్వహణకు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిని నోడల్ సెంటర్‌గా ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ప్రభుత్వం నియమించింది. జిల్లాల నుంచి వచ్చే క్యాన్సర్ కేసుల డేటాను ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి స్టేట్ క్యాన్సర్ రిజిస్ట్రీని సిద్ధం చేస్తారు. ఈ డేటాను జాతీయ క్యాన్సర్ రిజిస్ర్టీకి అనుసంధానిస్తారు. ఈ సమాచారం ఆధారంగానే భవిష్యత్తులో క్యాన్సర్ నివారణ చర్యలు, స్ర్కీనింగ్ పరీక్షలు, చికిత్స సౌకర్యాల పెంపుపై సర్కారు విధానపరమైన నిర్ణయాలు తీసుకోనుంది. కాగా మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో వైద్య మంత్రి దామోదర రాజనర్సింహ క్యాన్సర్ పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించారు.