Share News

‘భూభారతి’తో భూ సమస్యలు పరిష్కారం

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:03 AM

రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలలో భాగంగా ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు, భవిష్యత్‌లో భూ సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమీకృత భూ భారతి పోర్టల్‌ను....

‘భూభారతి’తో భూ సమస్యలు పరిష్కారం

  • పక్కా ఆధారాలతో ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. కార్యాలయాల చూట్టూ తిరగాల్సిన పనిలేదు

  • ప్రతి జిల్లాలోని 70 గ్రామాల్లో పూర్తిస్థాయి సర్వే

  • సాదాబైనామాల సమస్యలకు మోక్షం కల్పిస్తాం

  • టెర్రరిస్టుల్లా బీఆర్‌ఎస్‌ నేతలు

  • పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు: మంత్రి పొంగులేటి

ఆమనగల్లు, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలలో భాగంగా ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు, భవిష్యత్‌లో భూ సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమీకృత భూ భారతి పోర్టల్‌ను తీసుకువచ్చినట్లు రెవెన్యూ శాఖ, హౌసింగ్‌, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. ఈ కొత్త విధానంలో భూ సర్వే, రిజిస్ట్రేషన్‌ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నామన్నారు. భూము ల రిజిస్ట్రేషన్‌ సమయంలోనే సర్వే నెంబర్‌కు సబంధించి భూదార్‌ నంబర్‌ ఇవ్వడంతో పాటు సరిహద్దులు, పక్కా కొలతలతో కూడిన మ్యాప్‌లను డాక్యుమెంట్‌తో పాటు అందించనున్నట్లు పేర్కొన్నారు. పక్కా ఆధారాలతోనే ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయనున్నట్లు తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మునిసిపాలిటి పరిధిలోని విఠాయిపల్లి గ్రామంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సమీకృత భూ భారతి పోర్టల్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రెవెన్యూశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతుల భూములకు భద్రత, భరోసా కల్పించేలా భూ భారతి చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తామని చెప్పారు. భూములు అమ్ముకున్న, కొనుగోలు చేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పోర్టల్‌ను రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై ఏ రైతు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా భూ భారతి పోర్టల్‌ను తెచ్చామన్నారు. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత వచ్చే ఫలితాలను బట్టి మార్పులు, చేర్పులు చేసి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మండలంలో, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి పోర్టల్‌ అమలు చేస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి భూములను సమగ్రంగా సర్వే చేస్తామన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులకు అనేక సమస్యలు సృష్టించిందని, ఏళ్ల పాటు రైతులు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. అందుకే తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్‌ను తీసేశామని, దానిని బంగాళాఖాతంలో వేశామన్నారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా మోక్షం లేకుండా ఉన్న సాదాబైనామాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేట్టిందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. భూమి సాగుచేస్తూ వారి ఆధీనంలో ఉండే భూములకు సంబంధించి సదరు వ్యక్తి నుంచి సమ్మతి పత్రం తీసుకుని వారికే భూమి పట్టాను ఖరారు చేస్తామని, ఇందుకోసం ఇటీవలే భూభారతిలో సవరణ చేసి జీవో జారీ చేశామన్నారు.


నెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు

ఇళ్లులేని పేదలందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు కేటాయిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఈనెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. శాసన సభలో బీఆర్‌ఎస్‌ నాయకులు టెర్రరిస్టుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు తరువాత కూడా వారికి జ్ఞానోదయం కాలేదన్నారు. పదేళ్లు అభివదిఇ్ధ పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన మండిపడ్డారు.

Updated Date - Apr 03 , 2026 | 05:03 AM