యాక్షన్ ప్లాన్ 99 రోజులు
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:58 AM
రాష్ట్రంలో పాలన, విధానాల అమలు, అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టింది...
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పనులపై ప్రత్యేక కార్యాచరణ
అమలుకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సభ్యులుగా మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొంగులేటి
శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు
పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, వైద్యం, విద్యా విభాగాల్లో ప్రణాళికలు
వేసవి నేపథ్యంలో నీటి ఎద్దడిపైనా దృష్టి
త్వరలో సబ్ కమిటీ తొలి భేటీ
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాలన, విధానాల అమలు, అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి ఓ చైర్మన్, ముగ్గురు సభ్యులతో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ చైర్మన్‌గా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం జారీ చేసింది. మార్చి 1 నుంచి జూన్ 9వ తేదీ మధ్య ఈ యాక్షన్ ప్లాన్ అమలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా శాఖల వారీగా వివిధ విభాగాల్లో చేపట్టాల్సిన పనులు, వాటి వివరాలు, 99 రోజుల వ్యవధిలో వాటిని ఎలా పూర్తి చేయాలనే అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ పని చేయనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేయాల్సిన అభివృద్ధి పనులు, తాగు నీరు, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సబ్ కమిటీ దృష్టి సారించనుంది. అలాగే వేసవి నేపథ్యంలో నీటి ఎద్డడి సమస్యపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది. ఇందుకోసం అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ యాక్షన్ ప్లాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఇప్పటికే సూచనలు ఉన్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో చేపట్టాల్సిన పనులపై ఇప్పటికే నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
గ్రామాలు, పట్టణ ప్రాంతాలు, కార్పొరేషన్ల పరిధుల్లో ఎక్కడెక్కడ ఏయే పనులు చేపట్టాలి, అత్యవసర పనులు ఏంటి, వాటికయ్యే ఖర్చు సహా దీర్ఘకాలిక పనుల వివరాలను సిద్ధం చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంతోపాటు రహదారుల మరమ్మతులకు సంబంధించిన వివరాలను కూడా యాక్షన్ ప్లాన్‌లో పొందుపర్చనున్నారు. అలాగే జూన్ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవనున్న నేపథ్యంలో ఈలోపే పాఠశాలల మరమ్మతులు, కల్పించాల్సిన మౌలిక వసతులపైనా దృష్టి పెడుతున్నారు. ఇలా శాఖల వారీగా వచ్చిన నివేదికలను క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుంది. ప్రతిపాదిత పనులకు అయ్యే ఖర్చులు, ముందుగా చేపట్టాల్సిన పనులేంటి తదితర అంశాలపై కమిటీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆయా పనుల పూర్తికి అవసరమయ్యే నిధుల ఏర్పాటుపైనా సబ్ కమిటీ చర్యలు తీసుకుంటుంది. కాగా శాఖల వారీగా చేపట్టాల్సిన పనుల జాబితాలు ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం త్వరలో ఉండనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇటీవలే పాలకవర్గాలు ఏర్పాటైన నేపథ్యంలో పాలకవర్గ సభ్యులకు యాక్షన్ ప్లాన్‌పై అవగాహన కల్పించి, పనుల నిర్వహణలో వారిని కూడా భాగస్వామ్యం చేయనున్నారు.
28న సీఎం అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం: సీఎస్
రాష్ట్రంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులపై 99 రోజుల కార్యాచరణను చేపట్టనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ కార్యాచరణలో భాగంగా అన్ని శాఖల వారీగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28న నిర్వహించే కార్యదర్శుల సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారని తెలిపారు. మార్చి 1న జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. మార్చి 2 నుంచి జూన్ 9వ తేదీ వరకు అభివృద్ధి పనుల అమలుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి, మంత్రులు ప్రారంభిస్తారని, ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ భవనాలను సిద్ధం చేయాలని చెప్పారు. ఇక, పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందాల(ఎంఓయూ) పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని వివిధ శాఖల కార్యదర్శులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. పెట్టుబడులు, ఎంఓయూల విషయంలో అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యంత్రాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎస్ సూచించారు.