సర్కారీ విద్యకు కొత్తరూపు
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:24 AM
ప్రభుత్వ పాఠశాలలు, ఆ పాఠశాలల విద్యార్థులంటేనే చాలా మందికి చిన్నచూపు. దాని వల్లే చాలామంది తల్లిదండ్రులు ఆర్థికంగా తమకు భారమైనా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.
రాష్ట్రానికే తలమానికంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్.. నర్సరీ నుంచి ఇంటర్ దాకా ఒకే చోట విద్య
డిజిటల్ తరగతులు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు
కార్పొరేట్‌ను తలదన్నేలా విద్యా బోధన, సదుపాయాలు
విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్
రాష్ట్ర వ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు
ఆరుట్లలో తొలి టీపీఎస్‌ను నేడు ప్రారంభించనున్న సీఎం
టీపీఎస్ నా మానస పుత్రిక: రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, ఆ పాఠశాలల విద్యార్థులంటేనే చాలా మందికి చిన్నచూపు. దాని వల్లే చాలామంది తల్లిదండ్రులు ఆర్థికంగా తమకు భారమైనా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీని వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ తమ నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు.. ప్రభుత్వ పాఠశాలలో అది సరిగ్గా లేదు.. ఆ వసతి లేదు.. ఈ సదుపాయం లేదని చెబుతుంటారు. వీటన్నింటికీ చెక్ పెట్టేలా.. సర్కారీ విద్యకు కొత్తరూపునిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(టీపీఎస్) అనే విధానానికి నాంది పలికింది. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా.. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో సకల సదుపాయాలు, సౌకర్యాలతో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను ఆంగ్ల మాధ్యమంలో అందిస్తారు. ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధన చేసేందకు వీలుగా ఈ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తారు. ఈ పాఠశాలల్లో విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యమిస్తారు. ఇందులో భాగంగా క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్ వంటి క్రీడలను విద్యార్థులు ఆడేందుకు మైదానాలు ఏర్పాటు చేస్తారు. ఈ ఆటలతోపాటు చెస్, క్యారమ్స్ వంటి ఆటలు ఆడేందుకు క్రీడా పరికాలు, శిక్షకులను కూడా అందుబాటులో ఉంచుతారు. ఇదికాక, పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా ఇస్తారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చి వెళ్లేందుకు స్కూల్ బస్సులను కూడా అందుబాటులో ఉంచుతారు. ఇలా సకల సదుపాయాలతో 100 తెలంగాణ మోడల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పైలెట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా ఆరుట్ల, మంచాల, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లిలో టీపీఎ్‌సల నిర్మాణానికి ఎంపిక చేశారు. ఒక్కో టీపీఎస్ నిర్మాణానికి సుమారు రూ.60 కోట్లు వ్యయం చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఆరుట్ల తెలంగాణ మోడల్ స్కూల్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. రాష్ట్రంలో తొలి టీపీఎస్ అయిన ఈ పాఠశాలను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. మిగిలిన మూడు పాఠశాలల పనులు తుది దశలో ఉన్నాయి. మరో 3-4 నెలల్లో ఆ పనులు పూర్తి చేసి ఈ విద్యా సంవత్సరంలోనే వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. దశలవారీగా 100 టీపీఎ్‌సలు ఏర్పాటు చేస్తారు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభం
సీఎం రేవంత్ బుధవారం ఉదయం 9-30 గంటలకు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం(బ్రేక్‌ఫాస్ట్) తీసుకుంటారు. ఆపై, అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నిజానికి, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో డాక్టర్ ఆకునూరి మురళీ నేతృత్వంలో ప్రభుత్వం విద్యా కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ చేసిన సూచనలను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించడంతో టీపీఎస్ రూపుదిద్దుకుంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్ర విద్యా చరిత్రలో ఓ కొత్త మైలురాయి అని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యుడు పిఎల్.విశ్వేశ్వర్ రావు.. ఆరుట్ల టీపీఎస్ ప్రారంభం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.
ఆరుట్ల టీపీఎస్ అదుర్స్
తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఎంపికైన ఆరుట్ల పాఠశాలలో ఇప్పటికే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొనసాగుతుండగా.. కొత్తగా నర్సరీ, యూకేజీ, ఎల్‌కేజీ ప్రీప్రైమరీ తరగతులు ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో ఇప్పటికే బాలలు, బాలికలకు ప్రత్యేకంగా మోడల్ స్కూల్ ఉంది. 12వ తరగతి వరకు బోధన ఉంటుంది. టీపీఎ్‌సకు ఎంపిక చేయడంతో పాఠశాల రూపరేఖలు మార్చేశారు. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, విశాలమైన ప్లేగ్రౌండ్స్, ల్యాబ్స్, గాలి-వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. క్రీడా మైదానాలపాటు ప్రత్యేకంగా శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. ఐదు స్కూల్ బస్సులు ఏర్పాటు చేశారు. దీంతో టీపీఎ్‌సలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆరుట్ల టీపీఎ్‌సలో 1,814 మంది విద్యార్థులున్నారు. ప్రీ-ప్రైమరీవిభాగంలో 150మంది, ప్రైమరీస్కూల్‌లో 600, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు. డిమాండ్‌ను తట్టుకోలేక ‘నో అడ్మిషన్’ బోర్డు కూడా పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సమీప పాఠశాలలు అలాగే..
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను విలీనం చేసి ఒకే చోట ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉండగా.. దీనిని ప్రభుత్వం ఆమోదించలేదు. ఒకేచోట అన్ని వసతులతో పాఠశాలను అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారించింది. ప్రస్తుతం ఆరుట్ల మండలంలో ఇతర ప్రభుత్వ బడులు మాత్రం ఇది వరకులానే కొనసాగనున్నాయి.
సర్వస్వతీ కటాక్ష ఆలయం ఇది : సీఎం రేవంత్
మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలు, తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న తన సంకల్పానికి రూపం తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ బిడ్డల పాలిట సరస్వతీ కటాక్ష ఆలయంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపుదిద్దుకున్నదని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఆకలితీర్చి, అక్షరాలు నేర్పి, ఆటల్లో ప్రోత్సహించి పిల్లల్లో మనోవికాసం వికసించేలా రూపుదిద్దుకున్న టీపీఎస్ తన మానస పుత్రిక అని అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రాష్ట్రవ్యాప్తంగా 100 టీపీఎ్‌సల ఏర్పాటే తమ లక్ష్యమని పేర్కొన్నారు.