పెంచిన భూముల విలువలు మే నుంచే అమలు
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:15 AM
సవరించిన భూముల మార్కెట్ విలువలను మే మొదటి వారం నుంచి అమల్లోకి తీసుకురావాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది.
మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి
రిజిస్ట్రేషన్ల శాఖకు మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం
భూముల సమగ్ర వివరాలను సేకరించాలని నిర్దేశం
ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య పారిశ్రామిక పార్కులు
‘హిల్ట్’ మార్గదర్శకాల రూపకల్పనలో ప్రతినిధులకు చోటు
ఎవరినీ ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు: డిప్యూటీ సీఎం భట్టి
హిల్ట్ విధానం కింద కన్వర్షన్ చార్జీలను తగ్గించండి
రాష్ట్ర ప్రభుత్వానికి పారిశ్రామిక ప్రతినిధుల వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): సవరించిన భూముల మార్కెట్ విలువలను మే మొదటి వారం నుంచి అమల్లోకి తీసుకురావాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలో ఉన్న భూముల వివరాలను సేకరించాలని, వాటిలో ఖాళీగా ఉన్నవి, ఆక్రమణకు గురైనవి, శాఖలకు అందుబాటులో ఉన్న భూముల వివరాలను సేకరించాలని నిర్దేశించింది. జిల్లా కేంద్రాల్లోని భూముల వివరాలను కూడా సేకరించాలని తెలిపింది. ‘ఆర్థిక వనరుల సమీకరణ’ మంత్రివర్గ ఉప సంఘ సమావేశం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగింది. కమిటీ సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు. ఆదాయ మార్గాల అన్వేషణతోపాటు ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్)’ పాలసీపైనా చర్చించారు. కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను అధికారులు పక్కాగా అమలు చేసి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, అశ్రద్ధ చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. ‘‘హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. దీనిని ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేయడమే లక్ష్యం. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య చైనా తరహాలో ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని పారిశ్రామిక ఎస్టేట్ల ప్రతినిధులు సూచించారు. వాయు కాలుష్యం గణనీయంగా పెరిగిపోతున్నందున.. కాలుష్య కారక పరిశ్రమలను తరలించాలని చెప్పారు. వారి సూచనలను స్వాగతిస్తున్నాం. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.
అభివృద్ధి చేయని భూముల (యూడీఎల్) పాలసీ కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇండస్ట్రియల్ పార్కుల ప్రతినిధులు కలిసి భూములను అభివృద్ధి చేసుకునే ఆలోచన చేయాలి’’ అని భట్టి విక్రమార్క చెప్పారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన లేదని, నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ అసోసియేషన్లతో చర్చించి హిల్ట్ పాలసీ అమలును వేగవంతం చేసుకుందామన్నారు. హిల్ట్ పాలసీ మార్గదర్శకాలను రూపొందించే ముందు ఎస్టేట్ల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. హిల్ట్ పాలసీ విషయంలో ప్రభుత్వం చాలా ఓపెన్‌గా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో కార్మికుల కోసం డార్మెటరీలను తప్పనిసరి చేశామని తెలిపారు. హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హిల్ట్ పాలసీని ఇష్టారాజ్యంగా అమలు చేస్తే తమ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇబ్బంది పడతారంటూ కొంతమంది నాయకులు తమను పిలిచి చెప్పారని, తాము 30 ఏళ్ల క్రితమే భూములను కొనుగోలు చేశామంటూ సేల్ డీడ్‌లను చూపించామని తెలిపారు. హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని, కన్వర్షన్ చార్జీలను స్వల్పంగా తగ్గించాలని ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సెక్రటరీ సత్యనారాయణ కోరారు. హిల్ట్ పాలసీ ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలకు ఆమోదయోగ్యంగా ఉందని, సబ్సిడీలు ఇవ్వకపోయినా, ఇండస్ట్రియల్ పార్కులను మాత్రం ఏర్పాటు చేయాలని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా అధ్యక్షుడు నరేంద్రబాబు అభిప్రాయపడ్డారు.