అత్యధికంగా వంద శాతం!
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:29 AM
భూములకు సంబంధించి.. సవరించిన విలువలను శుక్రవారం నుంచి నుంచే రిజిస్ట్రేషన్ల శాఖ అమల్లోకి తేనుంది. నాలుగేళ్ల తరువాత విలువల సవరణ జరగడంతో వ్యవసాయ భూములు....
వ్యవసాయ భూములతోపాటు నివాస స్థలాలు, ఫ్లాట్ల విలువలనూ సవరించిన సర్కార్
పెంపు ప్రకటనతో శుక్రవారం నాటి స్లాట్లు రీషెడ్యూల్
గురువారమే రిజిస్ర్టేషన్లు చేసుకునేందుకు పోటాపోటీ
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్ర జ్యోతి): భూములకు సంబంధించి.. సవరించిన విలువలను శుక్రవారం నుంచి నుంచే రిజిస్ట్రేషన్ల శాఖ అమల్లోకి తేనుంది. నాలుగేళ్ల తరువాత విలువల సవరణ జరగడంతో వ్యవసాయ భూములు, వాణిజ్య స్థలాలు, పాట్లు, అపార్ట్‌మెంట్లలోని ఽఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునే వారిపై కొంత మేర అధికంగా భారం పడనుంది. విలువల పెంపు ప్రకటనతో శుక్రవారం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న చాలా మంది గురువారానికి రీషెడ్యూల్ చేసుకున్నారు. దీంతో రిజిస్ర్టేషన్ల సంఖ్య రోజువారీ కంటే పెరిగిందని అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో 4 వేల నుంచి 5 వేల వరకు రిజిస్ర్టేషన్లు జరుగుతుంటే... గురువారం ఆ సంఖ్య 6500 దాటింది.
ఉమ్మడి జిల్లాల వారీగా విలువల పెంపు ఇలా..
వరంగల్(హనుమకొండ): హనుమకొండ పరిధిలో ప్రస్తుతం గజం విలువ రూ.46000 ఉండగా.. దాన్ని రూ.69,000కు పెంచారు. ఫ్లాట్లకు సంబంధించి నగరంలో చదరపు అడుగు ధర రూ.3,100 ఉండగా దాన్ని రూ.4,700కు పెంచారు. అంటే.. 51.8శాతం మేర పెరిగింది. అర్బన్ పరిధిలో వ్యవసాయ భూముల విలువ ఎకరాకు రూ.2 కోట్లు ఉండగా.. వంద శాతం పెంచి రూ.4 కోట్లు చేశారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో చదరపు గజం విలువ రూ.29,000 ఉండగా.. దాన్ని రూ.44,900కు పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలు కొన్ని చోట్ల 40 శాతం, కొన్ని చోట్ల 70 శాతం పెరగ్గా, అతి తక్కువ చోట్ల 100శాతం మేర పెరిగింది. జనగామ పరిధిలో 30 నుంచి 80 శాతం వరకు విలువలు పెరిగాయి.
ఆదిలాబాద్: బోథ్ సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం పరిధిలో నివాస స్థలం గజానికి రూ.900 ఉండగా.. రూ.1100కు పెంచారు. అంటే... 22.22 శాతం పెరిగింది. కొన్ని చోట్ల 35శాతం వరకు పెంచారు. ఫ్లాట్లకు సంబంధించి చదరపు అడుగు విలువ రూ.1300ఉండగా.. అభివృద్ధి ప్రాతిపదికన కొన్ని ప్రాంతాల్లో రూ.1500కు పెంచారు. ఇదే జిల్లాలో వ్యవసాయ భూముల విలువ ఎకరా రూ.3,35,000 ఉండగా.. దీన్ని 49శాతం పెంచి రూ.5,00,000 చేశారు. సర్వేనంబర్ల ఆధారంగా కొన్ని చోట్ల 50శాతం,మరికొన్ని చోట్ల వంద శాతం పెంపు ఉంది.
నల్లగొండ: నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో వాణిజ్య స్థలం గజం విలువ రూ.27,100ఉండగా.. రూ.40,700కు పెంచారు. ఫ్లాటు విలువ ఎస్‌ఎఫ్‌టీకి రూ.1500 ఉండగా.. రూ.1800 చేశారు. రూ.2000 ఉన్న చోట్ల రూ.2400కు పెంచారు. నల్లగొండ గ్రామీణ పరిధిలో చదరపు గజం రూ.300 ఉంటే.. దాన్ని రూ.600 చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ఎకరా వ్యవసాయ భూమి విలువను రూ.7.50లక్షల నుంచి రూ.15లక్షలకు పెంచారు.
ఖమ్మం: ఖమ్మం నగరంలోని బల్లేపల్లి పరిధిలో గజం ధర రూ.3800ఉండగా.. రూ.5700కు పెంచారు. ధంసలాపురం, కొత్తగూడెం, అల్లీపురం పరిధిలో గజం ధర రూ.2100ఉంటే.. దాన్ని రూ.3200 చేశారు. వెలుగుమట్ల పరిధిలో పాత విలువ ప్రకారం గజం ఽవిలువ రూ.5800ఉంటే.. దాన్ని రూ.7800కు, ఖానాపురం హవేలిలో రూ.7800గా ఉన్న గజం విలువను రూ.11,700కు పెంచారు. ఖమ్మంలోని అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు ధర రూ.2000ఉండగా.. రూ.2400కు పెంచారు. సత్తుపల్లి మునిసిపాలిటీలో గజం నివాస స్థలం విలువ రూ.3800ఉండగా.. దాన్ని రూ.5700 చేశారు. రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెంలో ఎకరా విలువ రూ.60లక్షలు ఉంటే.. రూ.కోటికి పెంచారు. గిరిజన తాండాల్లో ఎకరా రూ.10 లక్షలు ఉంటే.. దాన్ని రూ.25 లక్షలు చేశారు.
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డులో గజం స్థలం విలువ రూ.2100 ఉండగా.. రూ.4200కు పెంచారు. భూత్పూర్ రోడ్డులో గజం రూ.7800 ఉంటే.. రూ.11900కు, రాయచూర్ -హైదరాబాద్ ప్రధాన రహదారిలో గజం విలువ రూ.17600 ఉండగా.. రూ.22 వేలకు పెంచారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లాటు చదరపు అడుగు విలువ రూ.1500 ఉంటే.. రూ.1800 చేశారు. జడ్చర్ల పరిధిలో జాతీయ రహదారి వెంట గజం విలువ రూ.1300 ఉంటే రూ.2600కు, కల్వకుర్తి పరిధిలో గజం రూ.9500ఉండగా.. రూ.16500కు పెంచారు. వ్యసాయ భూమి ఎకరా రూ.2.25 లక్షలుంటే.. 57 శాతం పెంచి రూ.3.93 లక్షలు చేశారు.
కరీంనగర్: కరీంనగర్ సబ్‌రిజిస్ర్టార్ పరిధిలో గజం విలువ రూ.5400 ఉండగా.. దాన్ని రూ.10,800కు పెంచారు. జగిత్యాల పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గజం రూ.4800 ఉంటే దాన్ని రూ.8000కు, సిరిసిల్లలో గజం రూ.2100 ఉంటే రూ.3500 చేశారు. మంచిర్యాల పరిధిలో గజం రూ.500 ఉన్న చోట రూ.700 చేశారు. ఫ్లాటు ఎస్‌ఎఫ్‌టీ విలువ రూ.2500 ఉంటే.. దాన్ని రూ.2700 చేశారు. మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో చదరపు గజం రూ.2400 ఉంటే ఆ విలువను రూ.3600కు పెంచారు.
నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్‌లో గజానికి రూ.1500 ఉన్న విలువను ఆయా ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి ఆధారంగా 10 నుంచి 50 శాతం పెంచారు. కొత్త విలువల ప్రకారం గజం విలువ రూ.1700 నుంచి రూ.25 వేల దాకా పెరిగింది. కామారెడ్డి పట్టణంలో గజం విలువ రూ.2100 ఉంటే రూ.2730కి పెంచారు.