Share News

భూముల ‘విలువల’ పెంపునకు సర్వం సిద్ధం

ABN , Publish Date - May 24 , 2026 | 04:23 AM

భూముల మార్కెట్‌ విలువ పెంపునకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి నూతన .....

భూముల ‘విలువల’ పెంపునకు సర్వం సిద్ధం

  • అత్యధిక ప్రాంతాల్లో 25శాతం పెరిగే అవకాశం

  • కొన్ని ప్రాంతాల్లో 50-75శాతం వరకు.. అక్కడక్కడా వంద శాతం పెంపు

  • కొన్ని చోట్ల ప్రస్తుత విలువల కొనసాగింపు

  • ఈ నెల 28 నుంచి అమల్లోకి కొత్త విలువలు

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): భూముల మార్కెట్‌ విలువ పెంపునకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి నూతన మార్కెట్‌ విలువలు అందుబాటులోకి రానున్నాయి. కోర్‌ పరిధిలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం అధికంగా ఉండటంతో.. ఈ ప్రాంతంలో ఫ్లాట్ల ధరల్లో పెద్దగా మార్పు లేకుండా ప్రస్తుత విలువలకు అదనంగా 10 నుంచి 20 శాతం వరకు పెంపును ప్రతిపాదించారు. ఒపెన్‌ ప్లాట్లు, వ్యవసాయ భూముల విషయంలో 20 శాతం నుంచి 100 శాతం వరకు పెంపు ఉన్నట్లు తెలిసింది. మొత్తమ్మీద 25 శాతం పెంపు ఉన్న ప్రాంతాలు అత్యధికంగా ఉంటాయని, 50 నుంచి 75 శాతం పెంపు ఉన్న ప్రాంతాలు ద్వితీయ శ్రేణి క్యాటగిరిలో, 100 శాతం పెంపు ఉన్న ప్రాంతాలు తృతీయ క్యాటగిరీలో స్వల్పంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అసలు పెంపు లేని ప్రాంతాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రస్తుతం ఉన్న ధరలనే కొనసాగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

అదనపు కలెక్టర్ల పర్యవేక్షణలో కసరత్తు

వ్యవసాయ భూముల విషయంలో బహిరంగ మార్కెట్‌ విలువకు, రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించిన విలువకు మధ్య భారీగా వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలు, ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న బహిరంగ మార్కెట్‌ విలువను పరిగణలోకి తీసుకుని.. రిజిస్ట్రేషన్‌ విలువలను నిర్ణయిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అదనపు కలెక్టర్ల (రెవెన్యూ) పర్యవేక్షణలో ఈ కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే తహశీల్దార్లు ఆయా మండలాల పరిధిలో భూముల విలువల్లో ఎంత అంతరం ఉందనే సమాచారాన్ని అదనపు కలెక్టర్లకు అందజేశారు. సోమవారం జరిగే సమావేశంలో జిల్లాల స్థాయిలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఔటర్‌ రింగు రోడ్డు అవతల ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువలను వంద శాతం మించి పెంచాలని కొందరు తహశీల్దార్లు ప్రతిపాదించారు.


రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానమై ఉన్న చౌటుప్పల్‌, యాదాద్రి, షాద్‌నగర్‌, కడ్తాల్‌, సదాశివపేట, మహేశ్వరం, తుక్కుగూడ, ఆదిభట్ల, దుండిగల్‌ తదితర ప్రాంతాల్లో ఈ పెంపును ప్రతిపాదించినట్లు సమాచారం. భానూరు, పటాన్‌చెరు ప్రాంతాలు పారిశ్రామిక బెల్ట్‌ నుంచి రెసిడె న్షియల్‌ బెల్ట్‌గా మారుతున్నాయి. ఈ ప్రాంతాల్లో భూముల విలువలను వాస్తవ పరిస్థితులకు దగ్గరగా పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. మోకిల, శంకరపల్లి వంటి ప్రాంతాల్లో విల్లా ప్రాజెక్టులు, గేటెడ్‌ కమ్యునిటీల అభివృద్ధి ఎక్కువ ఉంది. ఇక్కడ వంద శాతం పెంపునకు అవకాశం ఉంది. మరోవైపు, ఇప్పటికే వ్యవసాయ భూముల విలువలు అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో పాత విలువలను కొనసాగించేలా పెంపు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిసింది. ఉదాహరణకు బేగంపేట మండలంలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారమే ఎకరా రూ.30 కోట్లకు పైగా ఉంది. ఇలాంటి చోట్ల 5-10 శాతం లోపు పెంచనున్నట్లు తెలుస్తోంది.

ధరల నిర్ణయం కమిటీలదే

నాలుగేళ్ల తరువాత భూముల మార్కెట్‌ విలువలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించగా.. పెంపు బాధ్యతలను రిజిస్ట్రేషన్‌ శాఖ జిల్లా కమిటీలకు అప్పగించింది. ఆయా జిల్లాల పరిధిలో పూర్తి స్థాయిలో కమిటీలే వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకుని ప్రభుత్వ సూచనల ప్రకారం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే జిల్లా కమిటీలు ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలించిన రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు.. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువల పెంపుపై కొన్ని సూచనలు చేశారు. సోమవారం నాటికి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. భూముల విలువ పెంపుపై ప్రాథమిక నివేదికలు సిద్ధం చేశాక.. ప్రజల నుంచి, రియల్టర్ల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటారు. జిల్లా స్థాయి కమిటీలు సిఫారసు చేసిన ధరలను.. రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించాక ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేస్తుంది.

Updated Date - May 24 , 2026 | 04:23 AM