Share News

గరిష్ఠం 100శాతం.. కనిష్ఠం 25శాతం

ABN , Publish Date - May 07 , 2026 | 04:51 AM

రాష్ట్రంలో భూముల విలువను పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. ప్రాంతాల వారీగా ఎలా పెంచాలనే దానిపై కసరత్తు జరుపుతోంది.

గరిష్ఠం 100శాతం.. కనిష్ఠం 25శాతం

  • భూముల విలువ పెంపుపై ప్రభుత్వం యోచన

  • మార్కెట్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ ధరల మధ్య తేడా ఎక్కువ చోట్ల అమలు

  • జిల్లాల నుంచి ధరల వివరాలను తెప్పించుకొని అధికార్ల అధ్యయనం

  • ప్రజలపై భారం పడకుండా విడతల్లో పెంచాలి: ఆర్థిక సలహాదారు

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో భూముల విలువను పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. ప్రాంతాల వారీగా ఎలా పెంచాలనే దానిపై కసరత్తు జరుపుతోంది. గరిష్ఠంగా వందశాతం, కనిష్ఠంగా 25 శాతం పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. భూముల మార్కెట్‌ విలువకు, రిజిస్ట్రేషన్‌ శాఖ అమలు చేస్తున్న విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో 75శాతం దాకా పెంచాలని, రెండు విలువలకు మధ్య తేడా 15శాతం లోపే ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు లేకుండా యథాతథ స్థితి కొనసాగించాలని, వాణిజ్య సంస్థలకు సంబంధించిన భూముల విషయంలో పెంపు చేపట్టవద్దని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సాగు, సాగేతర భూముల విలువలకు సంబంధించి జిల్లాల వారీగా వివరాలు తెప్పించిన రిజిస్ట్రేషన్‌ శాఖ.. 2022లో పెంచిన భూముల విలువలను, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో జరుగుతున్న లావాదేవీలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు జరుపుతున్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో భూముల మార్కెట్‌ విలువలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నిర్మాణ రంగం పురోగతి, గత నాలుగేళ్లలో చోటుచేసుకున్న మార్పులను పరిగణలోకి తీసుకుని ప్రస్తుత విలువలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం చదరపు అడుగు ధర రిజిస్ట్రేషన్‌ శాఖ పుస్తక విలువ ప్రకారం కోర్‌ అర్బన్‌ పరిధిలో సగటున రూ.3500 ఉంటే దీన్ని కనీసం 75 శాతం పెంచితే చదరపు అడుగు విలువ రూ.6125కు చేరుతుంది. చదరపు అడుగు రూ.1800 ఉన్న ప్రాంతాల్లో మార్కెట్‌ విలువకు ప్రభుత్వ విలువకు మధ్య తేడా అధికంగా ఉంటే.. వంద శాతం వరకు పెంచే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రకారం కొండాపూర్‌-గచ్చిబౌలిలో గజం ధర సగటున రూ.26,700 ఉంది. ఇక్కడ 75 శాతం వరకు పెంచితే విలువ రూ.46,725కి చేరుతుంది. అదే 25 శాతం పెంచితే రూ.33,375కి చేరుకుంటుంది.


నార్సింగ్‌ పరిధిలో ప్రస్తుతం గజం ధర రిజిస్ట్రేషన్‌ శాఖ పుస్తక విలువ ప్రకారం రూ.23,800 ఉంది. దీనిని 75 శాతం వరకు పెంచితే ధర రూ.41,650లకు, 25 శాతం పెంచితే రూ.29,750లకు చేరుకుంటుంది. ఈ ప్రాంతంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఖరీదైన గేటెడ్‌ కమ్యూనిటీలు, హైరైజ్‌ భవనాల నిర్మాణం పెద్దఎత్తున జరుగుతోంది. రిజిస్ట్రేషన్‌ శాఖ విలువకు, మార్కెట్‌ విలువకు భారీ వ్యత్యాసం ఉంది. అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల ధరలు చదరపు అడుగుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు పలుకుతున్నాయి. కానీ, రిజిస్ట్రేషన్‌ శాఖ విలువ చదరపు అడుగు ధర రూ.4 వేల లోపే ఉంది. దీన్ని రూ.7 వేల వరకు పెంచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. రిజిస్ట్రేషన్‌ శాఖకు వస్తున్న ఆదాయంలో ఫ్లాట్ల కొనుగోలు నుంచి 65 శాతం, ప్లాట్లు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల నుంచి 35 శాతం వరకు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రూ.కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య ఉన్న ఫ్లాట్ల కొనుగోళ్లు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో, ఫ్లాట్ల విలువల పెంపు ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

ఒకేసారి కాకుండా.. విడతలవారీగా పెంపు

రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుతో ఆదాయాన్ని పెంచుకోవటంపై గతంలో థర్డ్‌ పార్టీ ఏజెన్సీ ఇచ్చిన నివేదికలో ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఏటా కనీసం 2 శాతమైనా పెంచాలని, మహారాష్ట్రలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపింది. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఏటా భూముల విలువ పెంచడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని సూచించింది. తాజాగా ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ కూడా.. 75 శాతం పెంపును ఒకేసారి అమలు చేయకుండా మూడు విడతల్లో పెంచాలని సూచించినట్లు సమాచారం. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతోపాటు ప్రజలు కూడా తమపై అధిక భారం పడిందనే భావనతో ఉండరని పేర్కొన్నట్లు తెలిసింది. నాలుగేళ్లకు ఒకసారి భారీగా పెంచటం కాకుండా, ఏటా స్వల్పంగా పెంచాలని ఆయన సూచించారు. ఈ విధంగా అన్ని కోణాల్లో శాస్త్రీయంగా అధ్యయనం జరిపి, ప్రాంతాల వారీగా భూముల విలువలను సవరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Updated Date - May 07 , 2026 | 04:51 AM