Share News

రూ.లక్ష కోట్ల భూ దోపిడీ!

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:34 AM

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.లక్ష కోట్ల భూ దోపిడీకి తెరతీసిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రేవంత్‌ ప్రభుత్వ భూ దోపిడీని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతానని చెప్పారు.

రూ.లక్ష కోట్ల భూ దోపిడీ!

సీఎం సోదరులు, మంత్రులు, కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు బందిపోట్లలా దోచుకుంటున్నారు

భూదందాలను ఆధారాలతో బయటపెడతా

10ఎకరాల శిఖం భూమిని పవన్‌ తిరిగిచ్చేయాలి

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్ర జ్యోతి): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.లక్ష కోట్ల భూ దోపిడీకి తెరతీసిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రేవంత్‌ ప్రభుత్వ భూ దోపిడీని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతానని చెప్పారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. ముఖ్యమంత్రి సోదరులు, మంత్రులు, కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ వనరులను బందిపోటు దొంగల్లా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి అయినా సరే ఈ భూ దోపిడీని అడ్డుకుంటానని చెప్పారు. కోడికుంట చెరువులో పవన్‌ కల్యాణ్‌ కొనుగోలు చేసిన 10 ఎకరాల శిఖం భూమిని వెంటనే తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రా విష కోరల నుంచి సాధించుకున్న తెలంగాణ కచ్చితంగా తమ జాగీరే అని అన్నారు. మూసీ నదీ గర్భంలో నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాన్ని నిర్మిస్తున్న శ్రీ ఆదిత్య బిల్డర్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఆ సంస్థ ఏడెకరాలు కబ్జా చేసిందని, దీని వెనక ఓ ఎంపీ ఉన్నారని ఆరోపించారు. ఓ బడా కాంట్రాక్టర్‌కు చెందిన ఐకాం సంస్థ నాగారాం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 59లో మేడి బావి, జాలుబావి చెరువుల వద్ద 5 ఎకరాలు కబ్జా చేసిందని చెప్పారు. దీనిపై మున్సిపాలిటీ తీర్మానం చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హైడ్రాకు బడాబాబుల సంస్థలపై చర్యలు తీసుకునే దమ్ముందా? అని సవాలు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రాదు

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రె్‌సకు ఇదే చివరి అవకాశమని, మరో 20 ఏళ్లపాటు ఆ పార్టీని బొంద పెట్టేలా రేవంత్‌ పాలన ఉందని కవిత విమర్శించారు. గతంలో అక్రమాలకు, అవినీతికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కిటికీలు తెరిస్తే.. రేవంత్‌ ప్రభుత్వం ఏకంగా తలుపులు తెరిచిందని విమర్శించారు. నాడు, నేడు రాష్ట్రంలో నడుస్తున్నది కేటీఆర్‌ పాలనే అన్నారు. తెలంగాణ ఉనికిని కాపాడుకోవడానికి ప్రశ్నిస్తే.. దాన్ని ప్రాంతీయవాద ఉగ్రవాదం అని పవన్‌ అనడాన్ని కవిత తీవ్రంగా తప్పుపట్టారు. రాజ్యాంగబద్ధంగా ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, దోపిడీకి గురైన తెలంగాణ గడ్డపై మళ్లీ ఆంధ్రా సమైక్యవాదుల రాజకీయం ఏంటని ప్రశ్నించారు.

Updated Date - Jun 07 , 2026 | 06:34 AM