భూముల రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పాస్ పుస్తకాలు
ABN , Publish Date - Aug 22 , 2026 | 05:44 AM
భూముల రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
నకిలీ పాస్ పుస్తకాలను రద్దు చేస్తాం: మంత్రి పొంగులేటి
జగిత్యాల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ పాస్ పుస్తకాల ఆధారంగా అర్హతలేని వారంతా రైతుబంధు ప్రయోజనాలు పొందారని అన్నారు. భూ రీసర్వే అనంతరం నిజమైన రైతుల హక్కులను పరిరక్షిస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. జగిత్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ చేశారు. జగిత్యాల నియోజకవర్గ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాకు 70 గ్రామాల్లో భూముల రీ సర్వే జరుగుతున్నదని, ఏడాదిన్నర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వేను పూర్తి చేస్తామన్నారు.