Share News

భూసేకరణ కాదు.. సమీకరణ

ABN , Publish Date - Jul 24 , 2026 | 06:03 AM

తెలంగాణలో భూసేకరణకు నూతన విధానం అమల్లోకి రాబోతోంది. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం చట్టబద్ధంగా భూమిని సేకరించడం, నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించడం ప్రస్తుత పద్ధతి.

భూసేకరణ కాదు.. సమీకరణ

  • మెగా ప్రాజెక్టులకు నూతన విధానంపై కసరత్తు

  • పరిహారం బదులు భూయజమానిని అభివృద్ధిలో భాగస్వామి చేసే పద్ధతికి చట్టబద్ధత

  • ఎకరానికి 600-1000 చదరపుగజాల దాకా అభివృద్ధి చేసిన భూమి తిరిగిచ్చేలా కొత్త పాలసీ

  • తెలంగాణ ప్రాంత సమగ్రాభివృద్ధి, ప్రణాళిక బిల్లును అసెంబ్లీలో పెట్టనున్న సర్కారు!

  • అందులో ల్యాండ్‌ పూలింగ్‌కు ప్రత్యేక అధ్యాయం

హైదరాబాద్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భూసేకరణకు నూతన విధానం అమల్లోకి రాబోతోంది. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం చట్టబద్ధంగా భూమిని సేకరించడం, నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించడం ప్రస్తుత పద్ధతి. కానీ దీనివల్ల..భూములు కోల్పోతున్న రైతులు కోర్టులను ఆశ్రయించడం, అభివృద్ధి పనులను అడ్డుకోవడం, పరిహారం వివాదాలు, నిరసనలతో ప్రాజెక్టులు ఏళ్లతరబడి ముందుకుసాగని పరిస్థితి నెలకొంటోంది. పట్టణ ప్రాంతాల్లో.. ముఖ్యంగా హైదరాబాద్‌ లాంటి చోట్ల భూసేకరణ ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో భూమిని స్వాధీనం చేసుకోవడం కాకుండా.. భూయజమానిని అభివృద్ధిలో భాగస్వామిని చేసే విధానానికి చట్టబద్ధత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త విధానంలో.. రైతులు భూమిని ప్రభుత్వ అభివృద్ధి సంస్థకు ఇస్తారు. ప్రభుత్వం అక్కడ రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్తు, పార్కులు, ఇతర మౌలిక వసతులు కల్పించి, అభివృద్ధి చేసిన తరువాత అందులో నిర్ణీత భాగాన్ని తిరిగి రైతుకు ఇస్తుంది. ఈ మేరకు సర్కారు వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రాంత సమగ్ర అభివృద్ధి, ప్రణాళిక బిల్లు-2026ను ప్రవేశపెట్టనుంది. అందులో భూసమీకరణకు ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చారు. ఇది తెలంగాణ పట్టణాభివృద్ధి విధానంలో కీలక సంస్కరణగా ప్రభుత్వం భావిస్తోంది. భూమి ఇచ్చిన యజమానికి ఎకరానికి 600 నుంచి 1000 చదరపు గజాల దాకా.. అభివృద్ధి చేసిన ప్లాట్‌ ఇస్తారు.


మొత్తం అభివృద్ధి చేసిన భూమిలో 60ు రైతులకు, 40ు అభివృద్ధి సంస్థకు కేటాయిస్తారు. రోడ్లు, పార్కులు, ప్రభుత్వ అవసరాలకు, సామాజిక మౌలిక వసతుల కోసం 40 శాతం భూమిని వినియోగిస్తారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో గైడెడ్‌ ల్యాండ్‌ పూలింగ్‌(జీఎల్‌పీ)కు చట్టబద్ధత కల్పిస్తారు. దీని అమలుకు ప్రత్యేకంగా ల్యాండ్‌ రీకాన్‌స్టిట్యూషన్‌ ఆఫీస్‌ (ఎల్‌ఆర్‌వో) ఏర్పాటు చేస్తారు. వివాదాల పరిష్కారానికి అప్పీల్‌ బోర్డు, సాంకేతిక పర్యవేక్షణకు టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఉంటాయి.


ఎందుకీ విధానం అంటే..

గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌ పరిసరాల్లో ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రభుత్వానికి భారంగా మారింది. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్‌ పార్కులు, శాటిలైట్‌ టౌన్‌షి్‌పలు, బుల్లెట్‌ ట్రైన్‌ టెర్మినల్‌, మెట్రో విస్తరణ, లాజిస్టిక్‌ పార్కుల వంటి ప్రాజెక్టులకు వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఎకరానికి రూ.కోటి వరకూ పరిహారం చెల్లించిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో ప్రాజెక్టుల వ్యయం అంచనాలకు మించిపోతోంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతోపాటు భూములు ఇచ్చే రైతులకు భూసేకరణ చట్టం ద్వారా వచ్చే ఆదాయం కంటే మెరుగైన విధానాన్ని అందుబాటులోకి తెస్తే.. ఇరువైపులా ప్రయోజనాలు ఉంటాయనే సదుద్దేశంతో నూతన విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనివల్ల అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంది. కాగా, ల్యాండ్‌ పూలింగ్‌ విజయవంతం కావాలంటే.. పారదర్శకత, సమాన న్యాయం, ప్లాట్ల కేటాయింపుల్లో స్పష్టత, అభివృద్ధి కాలపట్టిక, రైతులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంచడం తప్పనిసరి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానంలో ఎలాంటి ఇబ్బందులూ రాకకుండా ఉండేందుకు.. గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ల్యాండ్‌పూలింగ్‌ నమూనాలపై ప్రభుత్వం అధ్యయనం చేసింది. అమరావతి నమూనాలో అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లు ఇచ్చే విధానంలో పెద్ద ఎత్తున భూ సమీకరణ జరిగినా.. అమల్లో జాప్యం, రాజకీయ మార్పుల వల్ల రైతుల్లో నెలకొన్న అనిశ్చితి నెలకొంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో పారదర్శక విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. గతంలో రాష్ట్రంలో కూడా హెచ్‌ఎండీఏ పరిధిలో ఉప్పల్‌ భగాయత్‌, ప్రతాప్‌సింగారం, కొర్ముల, తిమ్మాయిగూడ ప్రాంతాల్లో పూలింగ్‌ జరిగింది. అయితే ఇవన్నీ ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా జరిగినవే. ఇప్పుడు వాటికి చట్టబద్ధత కల్పించనున్నారు.

Updated Date - Jul 24 , 2026 | 06:03 AM