Share News

మార్కెట్‌ విలువల సవరణ సాధ్యమేనా!?

ABN , Publish Date - Apr 25 , 2026 | 06:19 AM

భూముల సవరించిన మార్కెట్‌ విలువలను మే మొదటి వారం నుంచి అమలు చేయాలంటూ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చేసిన నిర్దేశం అమలు సాధ్యమేనా!?

మార్కెట్‌ విలువల సవరణ సాధ్యమేనా!?

  • మే నుంచి అసాధ్యం అన్న రిజిస్ట్రేషన్‌ శాఖ

  • జూన్‌ లేదా ఆగస్టు నుంచి అమలుకు ప్రణాళికలు

  • విడతల వారీగా పెంచాలని యోచన

  • రిజిస్ట్రేషన్‌ ఫీజులు 6 శాతానికి తగ్గింపు?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్ర జ్యోతి): భూముల సవరించిన మార్కెట్‌ విలువలను మే మొదటి వారం నుంచి అమలు చేయాలంటూ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చేసిన నిర్దేశం అమలు సాధ్యమేనా!? ఈ ప్రశ్నకు ‘కాదు’ అనే అంటున్నాయి అధికార వర్గాలు. ఇందుకు కారణాలు ఉన్నాయని చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ రాజీవ్‌ హనుమంతు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల విధుల్లో ఉన్నారు. మే ఐదో తేదీ తర్వాత ఆయన విధుల్లో చేరనున్నారు. మార్కెట్‌ విలువల పెంపుపై అధ్యయనం చేస్తున్న అరవింద్‌ సుబ్రహ్మణియన్‌ కమిటీ ఆదాయ మార్గాల పెంపునకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. మే పదో తేదీ తర్వాత కమిటీ తన నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. గతంలో రిజిస్ట్రేషన్‌ శాఖ తయారు చేసిన నివేదికలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మార్కెట్‌ విలువలను ఒకేసారి 30 శాతం పెంచకుండా.. దశల వారీగా 10 శాతం చొప్పున పెంచాలని సూచించినట్లు తెలిసింది. దీనిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే, ఇంత తక్కువ సమయంలో భూముల సవరించిన మార్కెట్‌ విలువలను అమలు చేయడం సాధ్యం కాదని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు. జూన్‌ లేదా ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు.


ప్రభుత్వం వద్ద పలు రకాల ప్రతిపాదనలు

మార్కెట్‌ విలువల సవరణకు సంబంధించి 2024 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు పలు రకాల ప్రతిపాదనలను రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రభుత్వానికి అందించింది. స్టాంప్‌ డ్యూటీ తగ్గించి.. మార్కెట్‌ విలువలను సవరించాలనే ప్రతిపాదనను స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్టాంప్‌ డ్యూటీ 5.5 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతం ఉన్నాయి. మొత్తంగా 7.5 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. దీన్ని 6 శాతానికి కుదించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. పెట్టుబడుల ఆకర్షణకు వీలుగా అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహా స్టాంప్‌ డ్యూటీ ఉండాలనే కేంద్ర ప్రభుత్వ సూచనలను పరిగణనలోకి తీసుకుని ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు యథాతథంగా ఉంచి.. మొత్తంగా 6 శాతానికి పరిమితం చేస్తే ఆర్థికంగా తలెత్తే నష్టాన్ని అంచనా వేస్తూ ప్రతిపాదనలు ఇచ్చారని తెలిసింది. దీంతోపాటు మార్కెట్‌ విలువలకు సవరణలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుండటంతో ఎక్కడ పెంచాలి.. ఎక్కడ తగ్గించాలనే ప్రతిపాదనలు అందజేశారని తెలిసింది. కోర్‌ అర్బన్‌ వరకు పెంచితే ఎలా ఉంటుందనే కోణంలోనూ ప్రతిపాదనలు ఇచ్చినట్లు సమాచారం.


నాలుగేళ్ల తర్వాత పెంపు

తెలంగాణలో 2021లో నాటి ప్రభుత్వం తొలిసారి అప్పటి మార్కెట్‌ విలువలను 20 శాతం పెంచింది. తర్వాత ఒక్క ఏడాదిలోనే 2022లో మరో 33 శాతం పెంచింది. మళ్లీ ఇప్పుడు భూముల విలువల పెంపునకు కసరత్తు జరుగుతోంది. నిజానికి, రిజిస్ట్రేషన్‌ శాఖకు వస్తున్న మొత్తం ఆదాయంలో అపార్ట్‌మెంట్ల నుంచి 35 శాతం, ఓపెన్‌ ప్లాట్ల నుంచి 23 శాతం, ఇళ్ల నుంచి 20 శాతం వస్తోంది. అలాగే, మార్కెట్‌ విలువలు శాస్త్రీయంగా ఉండాలంటూ ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే ప్రాంతాల్లో ఎంతమేర పెంచాలి!? అపార్ట్‌మెంట్లు, ఓపెన్‌ ప్లాట్ల విషయంలో ఎంత పెంచాలనే దానిపై కసరత్తు పూర్తయింది. అపార్ట్‌మెంట్లు, ఓపెన్‌ ప్లాట్ల విషయంలో ఇప్పుడున్న మార్కెట్‌ విలువలను 100 నుంచి 300 శాతం వరకు పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయ లక్ష్యం రూ.19 వేల కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూముల విలువలు పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్‌ ధర రిజిస్ట్రేషన్‌ శాఖ పుస్తక విలువ ప్రకారం నగరాల్లో సగటున రూ.3000 ఉంటే.. దీన్ని వంద శాతం పెంచితే రూ.6000 అవుతుంది. చదరపు అడుగు రూ.1,800 ఉన్న ప్రాంతాల్లో దాన్ని 300 శాతం పెంచితే రూ.5,400 అవుతుంది. రిజిస్ట్రేషన్‌ శాఖ పుస్తక విలువ ప్రకారం.. కొండాపూర్‌-గచ్చిబౌలిలో గజం ప్రస్తుతంరూ.26,700 ఉంది. అదే వాణిజ్య స్థలమైతే రూ.44,900 ఉంది. ఈ ధరలను వంద శాతం పెంచితే ఎలా ఉంటుందనే కోణంలో ప్రతిపాదించినట్లు తెలిసింది.


మహేశ్వరంలో గజం రూ.2,100, మోకిలలా రూ.2,300 చొప్పున ఉంది. ఇలాంటిచోట్ల మార్కెట్‌ విలువను గరిష్ఠంగా రూ.6,000 వరకు పెంచనున్నట్లు సమాచారం. ఇక, నార్సింగ్‌ వంటి ప్రాంతాల్లో గజం రూ.23,800, మణికొండలో రూ.23,900, రాయదుర్గంలో రూ.44,900, బుద్వేల్‌లో రూ.10,200, శేర్‌లింగంపల్లి పరిధిలో రూ.26,700 ఉంది. వీటిని రూ.50-60 వేల మధ్య ఉండేలా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. కొండాపూర్‌ వంటి ప్రాంతాల్లో చదరపు గజం రూ.10 వేల చొప్పున అధికారికంగా అమ్మకాలు చేస్తున్నారు. కానీ, అక్కడ రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రకారం రూ.3,200 మాత్రమే. ఇలాంటి చోట్ల ఒకేసారి పెంచాలా.. దశలవారీగా పెంచాలా అనే కోణంలో కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. వాస్తవ విలువలకు, రిజిస్ట్రేషన్‌ శాఖ విలువలకు చాలాచోట్ల పొంతన లేదు. వీటిని సరిదిద్దేలా అధికారులు ప్రతిపాదనలు చేశారనే ప్రచారం జరుగుతోంది. వాణిజ్య ప్రాంతాల్లో ఎంత శాతం పెంచాలి? వ్యవసాయ ప్రాంతాల్లో ఏం చేయాలనే అంశంపైనా ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి.

Updated Date - Apr 25 , 2026 | 06:21 AM