Share News

భూముల మార్కెట్‌ విలువల పెంపుతో..మందకొడిగా రిజిస్ట్రేషన్లు

ABN , Publish Date - Jun 06 , 2026 | 03:57 AM

భూముల మార్కెట్‌ విలువల పెంపు నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగాయి. విలువలు పెంచడానికి ఒక రోజు ముందు..

భూముల మార్కెట్‌ విలువల పెంపుతో..మందకొడిగా రిజిస్ట్రేషన్లు

  • పెంచడానికి ముందు రోజు.. రూ.73 కోట్ల ఆదాయం

  • పెంపు అమల్లోకి వచ్చిన రోజు ఆదాయం.. రూ.45 కోట్లు

  • మా భూమి ఎకరా రూ.2 కోట్లు ఎలా అయిందో చెబుతారా?

  • టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్‌ చేసి ఆరా తీస్తున్న పలువురు ప్రజలు

  • ఎనిమిది సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో వాణిజ్య అపార్ట్‌మెంట్లలోని గ్రౌండ్‌ ఫ్లోర్లలో.. 11 శాతం తగ్గింపు

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్ర జ్యోతి): భూముల మార్కెట్‌ విలువల పెంపు నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగాయి. విలువలు పెంచడానికి ఒక రోజు ముందు.. అంటే గురువారం పెద్దఎత్తున లావాదేవీలు జరగడంతో రిజిస్ట్రేషన్‌ శాఖకు రూ.73 కోట్ల ఆదాయం సమకూరింది. కొత్త విలువలు అమల్లోకి వచ్చిన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3000 రిజిస్ట్రేషన్లు జరిగాయని.. సాధారణ రోజులతో పోల్చితే ఇది కొంచెం తక్కువే అని అధికారులు పేర్కొన్నారు. వీటి ద్వారా రూ.45 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిసింది. కాగా.. శుక్రవారం చాలా మంది రిజిస్ట్రేషన్‌ శాఖ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్లు చేసి పలు సందేహాలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. ‘‘ముందు తీసుకున్న చలానా ప్రకారం రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారా.. కొత్త విలువ ప్రకారం చలానా తీసుకోవాలా?’’ అని చాలామంది అడిగారు. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువ రూ.2 కోట్ల వరకు చేరడంతో.. ‘‘అంత ధర ఎలా నిర్ణయించారో చెబుతారా?’’ అంటూ కొంత మంది ప్రశ్నించినట్టు తెలిసింది. సర్వే నంబర్లవారీగా భూముల విలువ ఎంత పెరిగిందో తెలుసుకునేందుకు కొంత మంది.. పెంచిన మార్కెట్‌ విలువలతో సర్టిఫికెట్‌ ఇస్తారా? అని ఇంకొంతమంది.. ‘‘వారం క్రితమే మేము అగ్రిమెంట్‌ చేసుకున్నాం. ఇప్పుడు అదే ధరకు రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారా?’’ అని మరికొంతమంద అడిగినట్టు తెలిసింది. కాగా.. డాక్యుమెంట్‌ డేట్‌ ఆఫ్‌ ప్రజెంటేషన్‌నే ప్రామాణికంగా తీసుకుని స్టాంపు డ్యూటీ చెల్లించాలని అధికారులు వివరించారు.


గ్రౌండ్‌ఫ్లోర్‌లో తగ్గింపు..

సవరించిన భూముల విలువలకు సంబంధించి 8 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల (రంగారెడ్డి, శేరిలింగంపల్లి, గండిపేట, శంషాబాద్‌, మేడ్చల్‌, వల్లభనగర్‌, బాలానగర్‌, కూకట్‌పల్లి) పరిధిలో.. వాణిజ్య అపార్ట్‌మెంట్లలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ విలువను 11 శాతం తగ్గించారు. ఈ ఎనిమిది కార్యాలయాల పరిధిలో ప్రస్తుతం వాణిజ్య భవనాల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చదరపు అడుగు రూ.7,300 ఉండగా, మిగిలిన అంతస్తుల్లో చదరపు అడుగు రూ.6,600గా ఉంది. విలువల సవరణల నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ శాఖ అపార్ట్‌మెంట్‌లో ఎన్ని అంతస్తులున్నా ఒకే ధరను నిర్ణయించడంతో ఈ మేరకు మార్పులు చేశారు. వల్లభనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ విలువల సవరణకు ముందు చదరపు అడుగు రూ.8,600 ఉండగా, ఆపై అంతస్తులకు రూ.7,800 ఉంది. ఇప్పుడు అన్ని అంతస్తులకూ రూ.7800 వర్తించనుంది.

పెంపు లేనివి..

నివాస అపార్ట్‌మెంట్లకు సంబంధించి హైదరాబాద్‌ నగరంలో ఎలాంటి పెంపూ లేని ప్రాంతాలు.. చిక్కడపల్లి, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, హిమాయత్‌నగర్‌, హైదర్‌గూడ. బంజారాహిల్స్‌లో రూ.4500, ఫిల్మ్‌నగర్‌లో రూ.4800 ఉండగా ఆ విలువలను యథాతథంగా కొనసాగించారు. పుప్పాలగూడ, నార్సింగి, ఆదిబట్లలో చదరపు అడుగు గతంలో రూ.2,200 ఉండగా ఇప్పుడు రూ.2700కు పెంచారు. అలాగే.. ఆదిలాబాద్‌, జనగాం, భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, కరీంనగర్‌, మంచిర్యాల, భూపాలపల్లి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నల్గొండ, నారాయణపేట్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి జిల్లాలో 65 గ్రామాల్లో వ్యవసాయ భూముల విలువలను పెంచలేదు.

మీ ధర కంటే మా ధరే ఎక్కువ

కోర్‌ అర్బన్‌ పరిధిలో చాలా ప్రాంతాల్లో స్టాండ్‌ అలోన్‌ అపార్ట్‌మెంట్‌ విక్రేతలు తమ ప్రాంతాల్లో పెరిగిన విలువల గురించి తెలుసుకునేందుకు అధికారులకు ఫోన్లు చేశారు. అధికారులు చెప్పిన విలువలు తెలుసుకున్న తరువాత.. ‘‘మీరు పెంచిన దాని కంటే మేము ప్రస్తుతం విక్రయించే ధరలే ఎక్కువ ఉన్నాయి’’ అని వారు చెప్పినట్లు తెలిసింది. చదరపు అడుగుకు రిజిస్ట్రేషన్‌ శాఖ పెంచిన విలువ చాలా ప్రాంతాల్లో రూ.3500 నుంచి రూ.4000 లోపు ఉంది. కానీ, తాము ఇప్పటికే రూ.6000 చొప్పున విక్రయాలు చేస్తున్నామని కొందరు.. కొత్తగూడ, మాధాపూర్‌ లాంటి చోట్ల మరికొంతమంది చదరపు అడుగు రూ.9000 నుంచి రూ.10 వేల చొప్పున అమ్మకాలు చేస్తున్నట్లు చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. ఈ ధరల ప్రకారమే స్టాంపు డ్యూటీలు కడుతున్నట్టు బిల్డర్లు చెప్పడంతో.. రిజిస్ట్రేషన్‌ శాఖ పెంచిన విలువలను పట్టించుకోలేదని తెలిసింది.

Updated Date - Jun 06 , 2026 | 03:57 AM