Share News

కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వాలి

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:19 AM

రాష్ట్రంలో వ్యవసాయరంగంలో 36 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని, వారికి అధికారికంగా గుర్తింపు లేకపోవటంతో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం...

కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వాలి

  • ‘భూ ఆధీకృత సాగుదారుల చట్టం-2011’ను అమలు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి

  • హక్కుల విషయంలో ప్రమాదం లేదన్న భరోసా యజమానులకు కల్పించాలి

  • ‘కౌలు రైతుల గుర్తింపు’ కమిటీ డిమాండ్లు

  • అధ్యయనంపై నివేదిక విడుదల

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయరంగంలో 36 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని, వారికి అధికారికంగా గుర్తింపు లేకపోవటంతో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం, సబ్సిడీ వంటివి ఏవీ అందటం లేదని ‘తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ’ ఆందోళన వ్యక్తం చేసింది. ఏటా సాగు ప్రారంభంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలని, భూ ఆధీకృత సాగుదారుల చట్టం-2011’ను అమలు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 47 మండలాల్లో 57 గ్రామాలకు చెందిన 1,816 మంది కౌలు రైతులతో మాట్లాడి రూపొందించిన ‘కౌలు రైతుల సర్వే-2026 నివేదికను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు..

  • సర్వేలో పాల్గొన్న కౌలురైతుల్లో 47.2శాతం మంది బీసీ, 26.9శాతం ఎస్సీ, 13.9శాతం ఎస్టీ, 4.2శాతం ముస్లిం, 7.5శాతం మంది ఓసీ రైతులు ఉన్నారు. ఎస్సీ కౌలు రైతుల వద్ద భూమి అత్యంత తక్కువగా ఉంది.

  • కౌలు ధరలు పెరిగాయి. సగటున ఎకరానికి రూ.14,936 ఉండగా, గరిష్ఠంగా రూ.53వేల వరకు ఉంది. రైతుబంధుతో కౌలు తగ్గలేదు.

  • కౌలు పొలాల పరిమాణం పెరిగింది. 2022లో కౌలుకు తీసుకునే భూమి సగటున 5 ఎకరాలు ఉండగా... ప్రస్తుతం 6.7 ఎకరాలకు పెరిగింది. ఎకరానికి వచ్చే నికర ఆదాయం తగ్గింది. చిన్న రైతులు ఆదాయం పెంచుకోవటానికి ఎక్కువ భూమిని కౌలుకు తీసుకుంటున్నారు.

  • ‘యూరియా యాప్‌’తో సబ్సిడీ యూరియా కౌలు రైతులు అందరికీ లభించటం లేదు. 1,816 మందిలో 412 మందికే (22.8శాతం మందికి) సబ్సిడీ యూరియా దొరికింది. యజమానులే సబ్సిడీ యూరియా తీసుకొని బ్లాక్‌లో అమ్ముకున్నారు.

  • సీసీఐకి సంబంధించిన కపాస్‌ కిసాన్‌, పౌరసరఫరాలశాఖ తాలూకు ఓపీఎమ్మెస్‌ యాప్‌లతో కౌలు రైతులకు పంట అమ్ముకోవడంకష్టంగా మారింది.


  • భూ యజమానికే ఫోన్‌లో ఓటీపీ వస్తుండటంతో ఇతర రైతుల పేర్లపై కౌలు రైతులు పంటలు అమ్ముకుంటున్నారు. దీనికోసం వారు కమీషన్లు చెల్లించుకోవాల్సి వస్తోంది. ఉదాహరణకు సూర్యాపేట పత్తి రైతులు రూ.10 వేల వరకు కమీషన్‌ చెల్లించినట్లు సర్వేలో తెలిసింది.

  • సర్వేలో పాల్గొన్న 1,816 మందిలో 1,573 మంది గడిచిన మూడేళ్లలో వరదలు, భారీ వర్షాలు, వడగండ్లతో పంటలు నష్టపోయారు. ఇందులో 116 మంది మాత్రమే కౌలు రైతుల పేరిట నమోదయ్యారు. వీరిలో కేవలం 11 మందికి సొంత బ్యాంకు ఖాతాల్లో రూ.10వేల చొప్పున పంట నష్టపరిహారం జమ అయ్యింది. మిగిలింది భూ యజమానుల ఖాతాల్లోనే పరిహారం జమ అయింది. 45మంది భూయజమానులు తమ ఖాతాల్లో ప్రభుత్వం జమచేసిన పంట నష్టపరిహారాన్ని కౌలు రైతులకు ఇవ్వలేదు.

  • కౌలు రైతులందరూ ప్రైవేటు అప్పులే తీసుకుంటున్నారు. 24-36శాతం వరకు వడ్డీ కడుతున్నారు. ఒక్కొక్కరికి సగటున రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేసినప్పటికీ కౌలు రైతులకు ఎలాంటి ఉపశమనం లభించలేదు.

  • ఎక్కువ మంది కౌలురైతులు ప్రైవేటు మార్కెట్లో తక్కువ ధరకు పంట ఉత్పత్తులు అమ్ముకుంటున్నారు. ఉదాహరణకు.. పత్తి ఎమ్మెస్పీ రూ.8,110ఉంటే... రూ.6,500కే అమ్ముకున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులు అమ్మిన కౌలు రైతుల్లో... 25-35శాతం మంది సొమ్ము భూయజమానుల ఖాతాల్లో జమ అయ్యింది. ఇందులో 10-20శాతం మంది భూయజమానులు ఆ సొమ్మును కౌలు రైతులకు తిరిగి ఇవ్వలేదు. అంతేకాదు, పెద్ద మొత్తంలో నగదు జమకావటం చూసి... కౌలుదారులకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయని భావించిన భూయజమానులు కౌలు ధరలు పెంచుతున్నారు.


సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు

  • ఏటా సాగు ప్రారంభంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలి. భూయజమానులపై ఆధారపడే అవసరం తగ్గించాలి. బ్యాంకు రుణాలు, సబ్సిడీ ఎరువులు, విపత్తు నష్టపరిహారం కౌలు రైతులకు ఇవ్వాలి. కనీస మద్దతు ధరకు పంటల కొనుగోళ్లు జరపాలి.

  • కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తింపుచట్టాన్ని అమలుచేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో 2023 సెప్టెంబరు 13న రేవంత్‌రెడ్డి రైతులకు బహిరంగలేఖ రాశారు. ఈ హామీని అమలు చేయాలి.

  • బ్యాంకుల్లో స్వల్పకాలిక పంట రుణాలు పొందటానికి... కౌలు రైతులకు ‘రుణ అర్హత కార్డులు’ ఇవ్వాలి. ఈ-క్రాప్‌ బుకింగ్‌ వంటి ప్రభుత్వ పథకాలకు కౌలు రైతులను అర్హులుగా గుర్తించాలి.

  • కౌలు రైతుల చట్టం తీసుకువచ్చి కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించాలి. దీనివల్ల భూమిపై యజమానులకు ఉండే హక్కులకు ప్రమాదం లేదన్న అవగాహన కలిగించాలి.

సీఎం స్పందించి.. సమస్యలను పరిష్కరించాలి

నివేదిక విడుదల కార్యక్రమంలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ప్రసంగించారు. స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి కౌలు రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. కౌలు రైతులను గుర్తించటానికి ఉద్దేశించిన 2011 భూ కౌలుదారుల చట్టం ప్రగతిశీలమైనదని, దానిని వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, డి. నరసింహారెడ్డి, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ఆకునూరి మురళి, డాక్టర్‌ రుక్మిణిరావు, జస్టిస్‌ చంద్రకుమార్‌, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్‌ కుమార్‌, కన్నెగంటి రవి, బి. కొండల్‌రెడ్డి, తన్నేరు శ్రీహర్ష పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 05:19 AM