ఖరీఫ్‌లో 25 శాతానికి చేరిన పంటల సాగు
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:58 AM
రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగు 25 శాతానికి చేరింది. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతు పవనాలు బలహీనంగా మారడంతో... వర్షాలు పడటం లేదు..
9 శాతం లోటు వర్షపాతం
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగు 25 శాతానికి చేరింది. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతు పవనాలు బలహీనంగా మారడంతో... వర్షాలు పడటం లేదు. దీంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు నెలల వానాకాలం సీజన్‌లో జూన్ నెల ముగిసిపోయింది. ఇంకా మూడు నెలలు ఉన్నాయి. ఇప్పటి వరకు 9 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 134.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 123.1 మి.మీ వర్షపాతమే నమోదైంది. సాధారణం కంటే 9 శాతం తక్కువగా వర్షపాతం నమోదైనట్లు బుధవారం వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కేవలం రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. 17 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, హనుమకొండలో అత్యల్ప వర్షపాతం నమోదైనట్లు నివేదికలో పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 49 లక్షల ఎకరాలు కాగా... ఇప్పటి వరకు 26.83 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటారు. పత్తి కాకుండా మిగిలిన పంటలు చాలా తక్కువ విస్తీర్ణంలో సాగయ్యాయి. వరి 1.10 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 1.03 లక్షల ఎకరాలు, కంది 1.43 లక్షలు ఎకరాలు, సోయాబీన్ 1.65 లక్షల ఎకరాలు, పెసర్లు 21 వేల ఎకరాలు, మినుములు 6 వేల ఎకరాలు, చెరకు 22 వేల ఎకరాలు, ఇతర పంటలు 64 వేల ఎకరాల్లో సాగు చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు సాధారణ విస్తీర్ణం 1,32,44,305 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 33,27,118 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొంది.