Share News

కృష్ణా, భీమా నదులపై ఉమ్మడి బ్యారేజీలు!

ABN , Publish Date - May 26 , 2026 | 04:56 AM

కృష్ణా జలాల గరిష్ఠ వినియోగం కోసం కృష్ణా, భీమా నదులపై ఉమ్మడి బ్యారేజీలు నిర్మించే అంశంపై తెలంగాణ, కర్ణాటక మంత్రులు సోమవారం చర్చలు జరిపారు.

కృష్ణా, భీమా నదులపై ఉమ్మడి బ్యారేజీలు!

  • తెలంగాణ, కర్ణాటక మంత్రులు ఉత్తమ్‌, బోసురాజు చర్చలు

  • అధ్యయనానికి సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయం

  • కృష్ణానీటి గరిష్ఠ వినియోగంపై చర్చించాం: మంత్రి ఉత్తమ్‌

  • తెలంగాణ నిధులిస్తే ఆర్డీఎస్‌ను ఆధునీకరిస్తామన్న బోసురాజు

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల గరిష్ఠ వినియోగం కోసం కృష్ణా, భీమా నదులపై ఉమ్మడి బ్యారేజీలు నిర్మించే అంశంపై తెలంగాణ, కర్ణాటక మంత్రులు సోమవారం చర్చలు జరిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాల కోసం కృష్ణా నదిపై కొల్పూరు వద్ద ఒక బ్యారేజీ కమ్‌ బ్రిడ్జి.. భీమా నదిపై తంగిడి వద్ద మరో బ్యారేజీ నిర్మించే అంశంపై చర్చించారు. కొల్పూరు వద్ద బ్యారేజీ కమ్‌ బ్రిడ్జి నిర్మిస్తే.. ఎడమవైపు తెలంగాణ, కుడి వైపు కర్ణాటక లాభపడతాయని కర్ణాటక మంత్రి ప్రతిపాదించారు. భీమాపై తంగిడి వద్ద 0.5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తే ఇరు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలు తీరుతాయని చెప్పారు. బ్యారేజీల నిర్మాణంపై విస్తృతంగా చర్చించేందుకు సంయుక్త కమిటీ వేయాలని మంత్రులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్‌ ఆధునీకరణ పనులు చేపట్టాలని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కోరగా.. తెలంగాణ ప్రభుత్వం నిధులిస్తే వెంటనే పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని కర్ణాటక మంత్రి తెలిపారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ పరస్పర అవగాహనతో కృష్ణా జలాలను గరిష్ఠంగా వినియోగించుకొనే అంశంపైౖ చర్చలు జరిపినట్లు చెప్పారు. తాగు, సాగునీటి విషయంలో రాష్ట్ర హక్కులకు భంగం కలగకుండా.. ఉభయ రాష్ర్టాలకు సానుకూలంగా ఉండేలా చర్చలు జరిగాయన్నారు. ఈ చర్చల సారాంశాన్ని సీఎం ఎ.రేవంత్‌రెడ్డికి వివరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, రాయచూరు లోకసభ సభ్యుడు జి. కుమార్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 04:56 AM