నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి కల్యాణలక్ష్మి సొమ్ము!
ABN , Publish Date - Jul 11 , 2026 | 06:24 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
చెక్కులిచ్చే విధానానికి చెక్ పెట్టే యోచనలో సర్కారు
ఇకపై వేగంగా ప్రక్రియ పూర్తయ్యేలా ప్రత్యేక పోర్టల్
ఉన్నతస్థాయిలో సమీక్ష.. ఆర్థిక శాఖకు ఫైలు
ఇంకా ‘కల్యాణమస్తు’గా మారని ‘కల్యాణలక్ష్మి’!
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆడపిల్లల పెళ్లికి ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం అందజేస్తున్న రూ.1,00,116 సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేసేలా కసరత్తు జరుగుతోంది. అంతేకాదు ఈ పథకం ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా పోర్టల్ తీసుకువచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనితో వివాహమయ్యాక వీలైనంత త్వరలోనే లబ్ధిదారులకు సొమ్ము అందేందుకు వీలు కలగనుంది.
సుదీర్ఘ ప్రక్రియ.. అనవసరపు జాప్యం..
ప్రస్తుత విధానం ప్రకారం.. ఆడపిల్లల వివాహం అనంతరం కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ సాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మార్వో, ఆర్డీవోలు ఆ వివరాలను తనిఖీ చేస్తున్నారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే ఆమోదం అనంతరం దరఖాస్తును ఆమోదిస్తున్నారు. దరఖాస్తుదారులకు చెక్కుల రూపంలో సాయాన్ని అందిస్తున్నారు. కానీ ఎమ్మార్వో, ఆర్డీవో స్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. ఒక్కోసారి ఏడాదికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గానికి చెందిన గోపి 2025 ఏప్రిల్ 19న తన భార్య పేరు మీద కల్యాణలక్ష్మి సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అధికారులను ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేదని.. ఎమ్మెల్యే సంతకం పూర్తయి, ఆర్డీవో సంతకం పెండింగ్‌లో ఉన్నట్టు ఆన్‌లైన్‌లో చూపిస్తోందని గోపి పేర్కొన్నారు. ఇక ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఓ జంట 2026 జనవరిలో దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు దరఖాస్తు ఎమ్మార్వో కార్యాలయం దాటి ముందుకు వెళ్లలేదు. ఎమ్మార్వో, ఆర్డీవోలకు రోజువారీ బాధ్యతలు, సంక్షేమ పథకాల వ్యవహారాలతోపాటు జనగణన, ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (సర్) వంటి బాధ్యతలూ మీదపడటంతో పని ఒత్తిడి పెరిగిపోతోందని అంటున్నారు. ఏదేమైనా కల్యాణలక్ష్మి దరఖాస్తులు మాత్రం వేలల్లో పెండింగ్‌లో ఉంటున్నాయి. కొన్నిసార్లు లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు చెక్కులు అందజేసే సమయానికల్లా వాటి చెల్లుబాటు గడువు ముగిసిపోతోంది. ఈ కారణంగానే ఇటీవల ఓ మంత్రి అందించిన చెక్కు గడువు ముగిసిపోయి ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే చెక్కుల విధానానికి స్వస్తి పలికి లబ్ధిదారుల ఖాతాలోనే నేరుగా సాయాన్ని జమ చేయాలని (డీబీటీ) ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతోందని.. సంబంధిత ప్రతిపాదిత ఫైలు ఆర్థిక శాఖ వద్ద ఉందని సమాచారం. డీబీటీ విధానంతో చెక్కుల ముద్రణ, రవాణా, ఆడిటింగ్ వంటి సమస్యలూ తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక కల్యాణలక్ష్మి దరఖాస్తుల వెరిఫికేషన్, మంజూరు ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్‌ను తీసుకురావాలన్న ప్రతిపాదనపైనా చర్చ జరుగుతున్నట్టు తెలిసింది.
ఇంకా పేరు మారలేదు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కల్యాణలక్ష్మి పథకం పేరును ‘కల్యాణమస్తు’గా మార్చి అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. ఇప్పటికీ పథకం పేరు మారకుండానే కొనసాగుతోంది.