లేని జైలుకు బదిలీ..!
ABN , Publish Date - May 24 , 2026 | 04:21 AM
తెలంగాణ జైళ్ల శాఖలో చేపట్టిన బదిలీల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సుమారు పదేళ్ల తర్వాత చేపట్టిన బదిలీల్లో ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలుగుతుందని అంతా భావించినా...
అక్కడి నుంచి కావాల్సిన చోటుకు అటాచ్‌మెంట్
ముగిసిన వార్డర్, హెడ్ వార్డర్, ఇతర సిబ్బంది బదిలీ ప్రక్రియ
మిగిలిన కొన్ని పోస్టులకు త్వరలో బదిలీలు
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జైళ్ల శాఖలో చేపట్టిన బదిలీల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సుమారు పదేళ్ల తర్వాత చేపట్టిన బదిలీల్లో ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలుగుతుందని అంతా భావించినా... ఆ పరిస్థితి కనిపించలేదు. జైళ్ల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే వార్డర్, హెడ్ వార్డర్లతో పాటు ఇతర సిబ్బంది బదిలీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఆ పైస్థాయిలో ఉండే కొద్దిపాటి పోస్టులకు సంబంధించి త్వరలోనే బదిలీ ప్రక్రియ పూర్తి చేసేందుకు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన బదిలీల్లో సిబ్బంది కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నిజామాబాద్, సంగారెడ్డి లాంటి జైళ్లకు ఎలాంటి పోస్టింగులు జరగలేదని సమాచారం. పైగా కొన్నేళ్లుగా అందుబాటులో లేని వరంగల్ జైలుకు సిబ్బందిని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సుమారు 135 ఏళ్ల చరిత్ర కలిగిన వరంగల్ కేంద్ర కారాగారాన్ని 2021లో అప్పటి ప్రభుత్వం కూల్చివేసింది. ఖైదీలను ఇతర జైళ్లకు తరలించి, సిబ్బందిని ఇతర జైళ్లకు సర్దుబాటు చేసింది. అయితే తాజా బదిలీల్లో మనుగడలో లేని వరంగల్ జైలుకు సిబ్బందిని బదిలీ చేసి... ఆ వెంటనే అక్కడి నుంచి వారికి కావాల్సిన జైలుకు తిరిగి అటాచ్‌మెంట్‌పై పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఉదాహరణకు కరీంనగర్ జైలు నుంచి వరంగల్ జైలుకు బదిలీ చేసి... తిరిగి అటాచ్‌మెంట్‌పై కరీంనగర్‌లోనే పోస్టింగ్ ఇచ్చారు. రికార్డు ప్రకారం బదిలీ జరిగినట్లు కనిపిస్తున్నా... కొందరు పాత స్థానంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఇలా సుమారు 15 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నవారి విషయంలోనూ జరిగిందని, ఇవేం బదిలీలని సొంత శాఖలోని సిబ్బంది వాపోతున్నారు. కాగా బదిలీలు నిబంధనల మేరకే జరుగుతున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.