జైళ్లలో డీ అడిక్షన్ కేంద్రాలతో సత్ఫలితాలు
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:44 AM
జైళ్లలో డీ అడిక్షన్ కేంద్రాల ఏర్పాటు సత్ఫలితాలను ఇస్తోందని జైళ్లశాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. మత్తుకు బానిసై వచ్చిన ఖైదీలు శిక్ష పూర్తి చేసుకుని....
15,645 మంది ఖైదీలకు నివృత్తి సేవలు
జాతీయ సదస్సులో తెలంగాణ నమూనా
జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా
సైదాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): జైళ్లలో డీ అడిక్షన్ కేంద్రాల ఏర్పాటు సత్ఫలితాలను ఇస్తోందని జైళ్లశాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. మత్తుకు బానిసై వచ్చిన ఖైదీలు శిక్ష పూర్తి చేసుకుని బాహ్య ప్రపంచంలోకి వేళ్లే సమయానికి సత్ప్రవర్తన కలిగిన వారిగా తయారు చేసి సమాజానికి అందించడమే డీ అడిక్షన్ కేంద్రాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. చంచల్‌గూడ జైలులో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా దినోత్సవానికి డీజీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నివృత్తి డీ-అడిక్షన్ సెంటర్ అధికారిక లోగోను ఆవిష్కరించి, జైలు అధికారులు, ఖైదీలతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలోని నాలుగు కేంద్ర కారాగారాల్లో ఏర్పాటు చేసిన నివృత్తి కేంద్రాల ద్వారా ఏడాది కాలంలో 15,645 మంది ఖైదీలకు సేవలందించినట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాలపై ఆధారపడినట్లు గుర్తించిన 4,200 మందికి చికిత్స, పునారావాస సేవలు అందించామన్నారు. ఈ నెల 26న యునిటైడ్ నేషన్స్ ఆఫీస్ అన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యూఎన్‌వోడీసీ), టీవైసీఐఏ ఆధ్వర్యంలో పంజాబ్‌లో జరిగే జాతీయ సదస్సులో నివృత్తి ఉత్తమ విధానంపై డీఐజీ సంపత్‌తో కలిసి ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు డీజీ తెలిపారు. ఈ అవకాశం రావడం నివృత్తి కార్యక్రమాలకు లభించిన జాతీయ గుర్తింపు అని అన్నారు. కార్యక్రమంలో జైళ్లశాఖ ఐజీ మురళీబాబు, జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు.