Share News

వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై తెలంగాణ జాగృతి నిజనిర్ధారణ కమిటీ

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:00 AM

ఖమ్మంలోని వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడించారు.

వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై తెలంగాణ జాగృతి నిజనిర్ధారణ కమిటీ

  • బాధితులందరికీ సంపూర్ణ న్యాయం జరగాలి

  • రాజకీయేతరులతో కమిటీ : కవిత

హైదరాబాద్‌ సిటీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఖమ్మంలోని వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడించారు. రాజకీయాలతో సంబంధం లేని ప్రతినిధులతో కూడిన ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలికితీస్తుందని స్పష్టం చేశారు. విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్‌, ఆర్మీ మాజీ మేజర్‌ మదన్‌మోహన్‌, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు, న్యాయవాదులు ఇతర సంస్థల ప్రతినిధులు కమిటీ సభ్యులుగా ఉన్నారని ఆమె తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ధర్మ సమాజ్‌ పార్టీ (డీఎస్‌పీ) అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌, రిటైర్డ్‌ జడ్జి చంద్రకుమార్‌లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బాధితులందరికీ సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. నిజనిర్ధారణ కమిటీ పర్యటనకు ప్రభుత్వం సహకరించాలని, బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని కవిత పేర్కొన్నారు. పేదలకు జరుగుతోన్న అన్యాయం విషయంలో ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న ప్రొఫెసర్‌ కోదండరాం, ఆకునూరి మురళి, హరగోపాల్‌ వంటి మేధావులు స్పందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు 100 గజాల స్థలంతో పాటు వారి నివాసాల విలువను బట్టి పరిహారం చెల్లించాలని డీఎ్‌సపీ పార్టీ అధ్యక్షుడు విశారదన్‌ మహారాజ్‌ డిమాండ్‌ చేశారు. డిసెంబరు 9వరకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం, అప్పటివరకు ఆ కుటుంబాల అద్దె ఖర్చులు, పిల్లల విద్యాబాధ్యతలను స్వీకరించాలని స్పష్టం చేశారు.

Updated Date - Mar 18 , 2026 | 05:00 AM