Share News

ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేస్తే..రేషన్‌ కార్డు రద్దు!

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:22 AM

మీకు రేషన్‌కార్డు ఉందా? ఉంటే.. మీరు ఐటీఆర్‌ ఫైల్‌ చేశారా? ఎంత ఆదాయం చూపించారు? రూ.6 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్నట్లు ఐటీఆర్‌లో డిక్లరేషన్‌ ఇచ్చారా.....

ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేస్తే..రేషన్‌ కార్డు రద్దు!

  • క్షేత్రస్థాయిలో గ్రామ పరిపాలనాధికారుల విచారణ

  • కార్డుదారుల నుంచి డిక్లరేషన్‌ తీసుకుంటున్న జీపీవోలు

  • ఐటీఆర్‌లో ఎక్కువ ఆదాయం చూపిస్తే కార్డు రద్దేనని సమాచారం

  • రుణాల కోసం ఐటీఆర్‌ దాఖలు చేసిన చాలామంది..

  • ఆదాయం తక్కువ ఉన్నా భవిష్యత్‌ అవసరాల కోసం ఫైలింగ్‌

  • జీపీవోల విచారణతో రేషన్‌ కార్డుదారుల్లో ఆందోళన

  • ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ విన్నపాలు

మహబూబ్‌నగర్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘మీకు రేషన్‌కార్డు ఉందా? ఉంటే.. మీరు ఐటీఆర్‌ ఫైల్‌ చేశారా? ఎంత ఆదాయం చూపించారు? రూ.6 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్నట్లు ఐటీఆర్‌లో డిక్లరేషన్‌ ఇచ్చారా? అయితే మీ రేషన్‌కార్డు రద్దవుతుంది’’ ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న ప్రచారం ఇది. స్వయంగా గ్రామ పరిపాన అధికారులే (జీపీవోలు) ఈ విషయం చెబుతున్నారు. ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చిన వివరాల ఆధారంగా ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసిన రేషన్‌ కార్డుదారులపై క్షేత్రస్థాయిలో జీపీవోలు విచారణ జరుపుతున్నారు. సదరు కార్డుదారుల నుంచి జీపీవోలు మళ్లీ డిక్లరేషన్‌ కోరుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోయినా.. విచారణ మాత్రం వేగంగా జరుగుతోంది. దీంతో రేషన్‌కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక దాదాపు 5.61 లక్షల కొత్త రేషన్‌కార్డులను జారీ చేసింది. పేదలు దొడ్డుబియ్యం తినకపోవడంతో అవి అక్రమార్కుల పాలవుతున్నాయని.. వాటి స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో ప్రస్తుతం రేషన్‌ బియ్యం తినేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బియ్యం నాణ్యత కూడా బాగుండటంతో అందరూ ఇష్టపడుతున్నారు. ఒకరకంగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కొత్త రేషన్‌ కార్డులు, సన్నబియ్యం పంపిణీ మంచి మైలేజీ తెచ్చాయని చెప్పవచ్చు. కానీ, ఇప్పుడు రేషన్‌కార్డులు రద్దవుతాయంటూ జరుగుతున్న ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా రూ.4 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం కలిగి ఉంటే కొత్త ఆదాయపన్ను నిబంధనల ప్రకారం ఐటీఆర్‌ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం, ఖర్చులు, కటింగ్స్‌, చెల్లించిన పన్ను వివరాలను ఐటీఆర్‌లో పొందుపరుస్తారు.


ఏదైనా సందర్భంలో (ఆస్తుల అమ్మకం, పరిహారం, టీడీఎస్‌ కటింగ్స్‌, డిపాజిట్లు) ఆదాయపన్ను కట్‌ అయితే.. వాటిని తిరిగి పొందడం కోసం కూడా రిటర్న్స్‌ దాఖలు చేస్తారు. అయితే ఐటీ చెల్లించేవారికి, ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసేవారికి స్పష్టమైన తేడా ఉంది. కానీ, ప్రస్తుత విచారణలో ఐటీ చెల్లించేవారినే కాకుండా రిటర్న్స్‌ దాఖలు చేసేవారిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.ఉదాహరణకు ఎవరైనా భూనిర్వాసితుడికి పరిహారం అందితే ముందుగానే అధిక ఆదాయం కోణంలో ఆదాయపన్ను కట్‌ అవుతుంది. దానిని తిరిగి పొందాలంటే ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. కేవలం ఆదాయం ఎక్కువగా ఉన్న సందర్భంలోనే కాకుండా స్వచ్ఛందంగా కూడా ప్రజలు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేస్తారు. అలాగే, గృహ, వ్యక్తిగత రుణాల కోసం చాలామంది తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఏదో ఒక ఆదాయం చూపిస్తూ ఐటీ రిటర్న్స్‌ను ఫైల్‌ చేస్తారు. యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లు వచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యాపారులు, దుకాణదారులు కూడా తమ బ్యాంకు స్టేట్‌మెంట్లు చూపించి కట్‌ అయిన ట్యాక్స్‌ను రిటర్న్స్‌ ద్వారా తిరిగి పొందుతున్నారు. కొందరు ఆర్థిక క్రమశిక్షణ, భవిష్యత్‌ అవసరాలను ఉద్దేశించి కూడా రిటర్న్స్‌ను దాఖలు చేస్తారు. ఇప్పుడు అలా రిటర్న్స్‌ దాఖలు చేయడం వల్ల రేషన్‌కార్డుదారులు తమ కార్డును కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది.

కార్డుదారుల నుంచి డిక్లరేషన్‌ ..

రాష్ట్రంలో సుమారు 1.01 కోట్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 3.25 కోట్ల మంది లబ్ధిదారులు ప్రతినెలా 6 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం తీసుకుంటున్నారు. రేషన్‌ కార్డు కేవలం ఆహార భద్రతకు మాత్రమే కాకుండా ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ, సబ్సిడీ గ్యాస్‌ వంటి సంక్షేమ పథకాలు పొందేందుకూ కొలమానంగా మారింది. దీంతో రేషన్‌కార్డు ఉండటం రాష్ట్రంలో తప్పనిసరి అని ప్రజలు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం జీపీవోలు చేస్తున్న విచారణలో ఆదాయం ఎక్కువగా ఉన్నట్లు తేలితే వారి కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 30,186 మంది ఇలా ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసిన వారిపై విచారణ జరుగుతోంది. గద్వాల జిల్లాలో 9156 మంది ఐటీఆర్‌ దాఖలు చేసి రేషన్‌ పొందుతున్నవారు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 14,200 మంది రేషన్‌కార్డుదారులపై జీపీవోలు విచారణ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారు లక్షల్లో ఉంటారని సమాచారం.


రెక్కాడితే డొక్కాడని కుటుంబం

నేను జడ్చర్ల పట్టణంలో సెలూన్‌ నడుపుకొంటూ నాతోపాటు మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను. నెలకు రూ.15 వేలు సంపాదించుకుంటున్నాను. నా భార్య టైలరింగ్‌ చేస్తుంది. ఇంటికి లోన్‌ కావాలంటే మూడేళ్ల క్రితం ఐటీ రిటర్న్‌ అడిగారు. ఆ ప్రకారం ఫైల్‌ చేసి చూపించాను. తాజాగా ‘‘నువ్వు ఐటీ రిటర్న్స్‌లో రూ.6 లక్షల కంటే ఎక్కువ ఆదాయం చూపించావు. నీకు రేషన్‌కార్డు రద్దవుతుంది’’ అని ఫోన్‌ ద్వారా చెప్పారు. రెక్కాడితే డొక్కాడని మేము తెల్లరేషన్‌ కార్డుతోనే ప్రతినెలా బియ్యం తెచ్చుకొని తింటున్నాం. దయచేసి కార్డు రద్దు చేయవద్దు.

- శేఖర్‌, హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌, జడ్చర్ల

గుమస్తాగా పనిచేస్తున్నా

నేను బాదేపల్లి మార్కెట్‌లో గుమస్తాగా పనిచేస్తున్నాను. ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసేంత ఆదాయం నాకు రాదు. రేషన్‌కార్డు ద్వారా వచ్చే బియ్యం తినే బతుకుతున్నాం. నేను ఇప్పటివరకు ఎలాంటి ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయలేదు. ఇప్పుడు ఐటీ రిటర్న్స్‌లో ఆదాయం ఎక్కువగా చూపించానని, కార్డు రద్దవుతుందని ఫోన్‌ చేశారు. ఇలా ఎందుకు వచ్చిందో తెలియడంలేదు.

- ప్రకాశ్‌, గుమస్తా, జడ్చర్ల

Updated Date - Apr 01 , 2026 | 05:22 AM