Share News

ఏడాదికి రూ.80 లక్షల జీతంతో కొలువు..ఏఐ ప్రభావంతో పోయిన ఉద్యోగం!

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:40 AM

వాళ్లిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు.. బాల్య స్నేహితులు.. మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆ విషయాన్ని ఇద్దరూ తమ కుటుంబ సభ్యులకు చెప్పలేదు.

ఏడాదికి రూ.80 లక్షల జీతంతో కొలువు..ఏఐ ప్రభావంతో పోయిన ఉద్యోగం!

  • రహస్య వివాహం.. మానసిక కుంగుబాటు

  • ఇద్దరి మృతదేహాలను ఒకే అంబులెన్స్‌లో తీసుకెళ్లడంపై బంధువుల అభ్యంతరం!

  • తెలంగాణ టెకీ జంట బలవన్మరణంలో బాధాకరమైన విషయాలెన్నో..

హైదరాబాద్‌/గజ్వేల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): వాళ్లిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు.. బాల్య స్నేహితులు.. మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆ విషయాన్ని ఇద్దరూ తమ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. కొన్నేళ్లుగా గుట్టుగానే ఉంచారు. తాజాగా బెంగళూరులో కలిసి ఉంటూ, కలిసే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇదీ తెలంగాణకు చెందిన భానుచందర్‌రెడ్డి, షాజియా సిరాజ్‌ల కథ. ఏఐ ప్రభావంతో కొలువు పోవడంతో పాటు తల్లి తనతో మాట్లాడడం లేదన్న బాధ తో భానుచందర్‌రెడ్డి మానసికంగా తీవ్రంగా కుంగిపోయారు. ఆయన అమెరికాలో ఏడాదికి రూ.80 లక్షల వేతనంతో ఉద్యోగం చేసేవారు. ఏఐ ప్రభావంతో ఆయన పనిచేసే కంపెనీ లేఆ్‌ఫలు ప్రకటించింది. మరో ఉద్యోగం కోసం అమెరికాతో పాటు కెనడాలోనూ తీవ్రం గా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆయన భారత్‌కు తిరిగి వచ్చేశారు. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న షాజియా.. భానుచందర్‌ కోసం బెంగళూరు వెళ్లారు. కొత్త జీవితం ప్రారంభించాలని భావించారు. కానీ, భానుచందర్‌ మాత్రం తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అది చూసి షాకైన షాజియా కూడా 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ జంట విషాదాంతంలో మరో విషాదం ఏంటంటే.. పోస్ట్‌మార్టం తర్వాత వాళ్లిద్దరి మృతదేహాలను ఒకే అంబులెన్స్‌లో తీసుకెళ్తుంటే బంధులు అడ్డుచెప్పడం. ఆ సమయంలో అక్కడున్న వారు ‘‘బతికున్నప్పుడు ఎలాగూ ఇద్దరూ స్వేచ్ఛగా కలిసి ఉండలేకపోయారు. కనీసం చావులోనైనా వారిని కలిసి వెళ్లనివ్వండి’’ అని చెప్పి ఒప్పించారు. ఏఐ రాకతో ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, మానసిక కుంగుబాటు, కుల మతాల పట్టింపులు మనుషుల ప్రాణాలను ఎలా బలి తీసుకుంటున్నాయనేందుకు ఈ జంట దీన గాథే ఒక ఉదాహరణ.

Updated Date - Apr 03 , 2026 | 04:40 AM