ఆత్మగౌరవ పోరాటాల ఫలితమే తెలంగాణ
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:02 AM
ఆత్మగౌరవ పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు 12 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా కరీంనగర్‌లోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆయన మంగళవారం ఆవిష్కరించారు.
కరీంనగర్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): ఆత్మగౌరవ పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు 12 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా కరీంనగర్‌లోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ఘన నివాళులర్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పరిపాలన, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 దిశానిర్దేశక పత్రాన్ని ఆవిష్కరించిందన్నారు. తెలంగాణ నేడు దేశానికే కాదు, ప్రపంచానికి అభివృద్ధి నమూనాగా నిలుస్తుండడం మనందరికీ గర్వకారణమన్నారు.
ఫ ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతక్రీడలు, పర్యావరణ పరిరక్షణ వంటి కీలకమైన పది అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలు, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం, ప్రభుత్వ ఫలాలు ప్రతి కుటుంబానికి చేరడం, అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 2,913 పెండింగ్ ఫైళ్లను అధికారులు పరిష్కరించారన్నారు. జిల్లాలో నిర్వహించిన జాబ్‌మేళాలో 78 కంపెనీలు 292 మందికి ఉద్యోగాలిచ్చాయన్నారు. మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రయోజనకరంగా ఉందన్నారు. జిల్లాలో 9,23,700 సిలిండర్లను 500 రూపాయలకే సరాఫరా చేశారు. గృహజ్యోతి పథకం కింద ఇప్పటి వరకు 1,73,627 మంది వినియోగదారులు 153 కోట్ల రూపాయల లబ్ధి పొందారన్నారు. రైతు భరోసా కింద రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఫ జిల్లాలో 1.93 లక్షల మందికి రైతు భరోసా
జిల్లాలో రైతుభరోసా పథకం ద్వారా 1,93,544 మంది రైతులకు యాసంగి సీజన్‌లో 143.35 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. రైతుబీమా పథకం కింద జిల్లాలో వివిధ కారణాలతో చనిపోయిన 267 మంది కుంటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల చొప్పున 13.35 కోట్ల రూపాయల పరిహారాన్ని అందించి రైతులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుచుందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల స్వంత ఇంటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి, జిల్లాలో 10,114 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని వివరించారు. 7,076 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 2,081 మంది లబ్ధిదారులు గృహప్రవేశం పూర్తి చేసుకుని సొంత ఇళ్లలో నివసిస్తున్నారన్నారు.
ఫ 2,90,885 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ధాన్యం సేకరణలో జిల్లాలో యాసంగి సీజన్‌లో 319 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,90,885 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 554 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. 23,710 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 279 మెట్రిక్ టన్నుల సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నామని, మధ్యాహ్న భోజన పథకం కోసం ప్రతినెలా 600 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నామన్నారు.
ఫ 45,920 కొత్త రేషన్ కార్డులు
జిల్లాలో ఇప్పటివరకు 45,920 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. 96,775 మంది కుటుంబ సభ్యులను కొత్తగా రేషన్‌కార్డుల్లో చేర్చామన్నారు. జిల్లాలో 3,20,320 కుటుంబాలకు, ప్రతీ నెల 6,021 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 980 స్వయం సహాయక సంఘాల మహిళలకు 147 కోట్ల రూపాయలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 118 సంఘాలకు 17.7 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశామన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళా సంఘాలకు మూడు కోట్ల రూపాయల రుణాలు అందజేశామన్నారు. 1,33,293 మందికి ప్రతి నెల 31.32 కోట్ల రూపాయల చేయూత ఫించన్లను అందిస్తున్నామన్నారు. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమంలో బాగంగా జిల్లాలో ఒక లక్ష 41 వేల మంది మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు 10 లక్షల విలువైన మొబైల్ ఫిష్ రిటైల్ యూనిట్లను మంజూరు చేశామన్నారు.
ఫ విద్యారంగంలో అద్భుత ఫలితాలు
విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతిప్రణాళికలో బాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో విద్యావారోత్సవాలు ఘనంగా నిర్వహించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. సంక్షేమ హాస్టల్స్, విద్యా సంస్థల్లో కిచెన్, శానిటేషన్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీలో 13,137 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12,949 మంది విద్యార్థులు ఉతీర్ణులు కాగా, 98.57 ఉత్తీర్ణత శాతం సాధించారన్నారు. పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి 58 ప్రీ పైమ్రరీ స్కూళ్లను జిల్లాలో ప్రారంభిస్తున్నామన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో ఈ విద్యా సంవత్సరానికి 2,535 మంది ఎస్సీ విద్యార్థులకు ప్రవేశం కల్పించామన్నారు. 29,240 మంది బీసీ విద్యార్థులకు విద్యా సంవత్సరంలో 74.43 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 1,836 మందికి, షాదీ ముబారక్ పథకం ద్వారా 458 మంది వివాహాలకు 1,00,116 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలోని 38 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో రెండున్నర సంవత్సరాల్లో 52,116 మందికి ఉచితంగా ఆపరేషన్లు జరిగాయన్నారు. ఇందుకు 139 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు.
ఫ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం
మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలోని 777 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 7,579 మంది గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ భోజనం, 46,069 మంది పిల్లలకు బలవర్ధక ఆహారం అందిస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వివరించారు. మలిదశలో వయోవృద్ధుల మానసిక, శారీరక ఉల్లాసానికి డే కేర్ సెంటర్ ప్రారంభించామన్నారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి మైత్రి క్లినిక్ పని చేస్తుందన్నారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రికి, జిల్లాను సర్వతోముఖాభివృద్దికి నిర్మాణాత్మక సహకారం, సూచనలు అందిస్తున్న మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంఽథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం, కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అదనపు కలెక్టర్లు అశ్విని తానానీ వాఖడే, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నర్సన్న పాల్గొన్నారు.