Share News

పోస్టింగ్‌ ఇచ్చారు.. రద్దు చేశారు..!!

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:47 AM

ఐదు రోజుల కిందట (మే 31) అర్ధరాత్రి ఉత్తర్వులు.. ఈ నెల 1న జాయినింగ్‌.. 2న రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ.. 3న అకస్మాత్తుగా బదిలీ!

పోస్టింగ్‌ ఇచ్చారు.. రద్దు చేశారు..!!

  • సీఈగా పోస్టింగ్‌ ఉత్తర్వులు.. రెండ్రోజులకే రద్దు

  • నీటిపారుదల శాఖలో విచిత్ర నిర్ణయాలు

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఐదు రోజుల కిందట (మే 31) అర్ధరాత్రి ఉత్తర్వులు.. ఈ నెల 1న జాయినింగ్‌.. 2న రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ.. 3న అకస్మాత్తుగా బదిలీ!! ఇదేం నాటకీయ పరిణామాలు అనుకుంటున్నారా..? నీటిపారుదల శాఖలో ఒక ఎస్‌ఈకి చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలివి. ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) కార్యాలయంలో ఎస్‌ఈగా పనిచేస్తున్న పి.సత్యనారాయణరెడ్డిని మే 31వ తేదీ అర్ధరాత్రి సంగారెడ్డి సీఈగా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెడుతూ నీటిపారుదలశాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో ఆయన ఈ నెల 1న సీఈగా బాధ్యతలు స్వీకరించారు. 2న రాష్ట్ర అవతరణ వేడుకలకు కూడా హాజరయ్యారు. 3న ఆయన పోస్టింగ్‌ను రద్దు చేసి.. ఆ స్థానంలో కరీంనగర్‌ సీఈగా పోస్టింగ్‌ పొందిన అధికారికి బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి ఏప్రిల్‌ 30న కూడాఇలాగే జరిగింది. ఆ రోజున మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ సీఈగా పనిచేస్తున్న ఎ.సత్యనారాయణరెడ్డి పదవీ విరమణ చేశారు. ఆయన సర్వీసును పొడిగించడానికి వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న క్రమంలోనే హడావుడిగా హైదరాబాద్‌ సీఈగా ఒకరిని, మహబూబ్‌నగర్‌ సీఈగా పి.సత్యనారాయణరెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ ఉత్తర్వులు కూడా తెల్లారకముందే రద్దయ్యాయి. ఇక మే 1న ఎ.సత్యనారాయణరెడ్డి సర్వీసును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పట్లో సీఈ గా చేరకముందే పి.సత్యనారాయణరెడ్డి నియామక ఉత్తర్వులు రద్దుకాగా.. తాజాగా సీఈగా చేరిన తర్వాత రెండురోజులకే ఉత్తర్వులు రద్దుకావడం అధికార వర్గాల్లో విస్మ యం కలిగించింది. ఇక సంగారెడ్డి సీఈ పోస్టింగ్‌ అంటే భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడమే ప్రధాన విధి అని.. ప్రాజెక్టుల మరమ్మతులు వంటివి రెండో ప్రాధాన్యంగా ఉంటాయన్న విమర్శలు ఉన్నాయి.

Updated Date - Jun 05 , 2026 | 04:47 AM