Share News

ఇందిరమ్మ ఇళ్లకు టెండర్లు

ABN , Publish Date - Jul 27 , 2026 | 05:47 AM

పట్టణ గృహనిర్మాణ పథకం కింద కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.

ఇందిరమ్మ ఇళ్లకు టెండర్లు

  • 7,340 ఎల్‌ఐజీ ఫ్లాట్ల నిర్మాణానికి ఆహ్వానం

  • 10 ప్యాకేజీలు.. 16 టవర్లు.. 10 అంతస్తులతో నిర్మాణం

  • అధికంగా ప్యాకేజీ-2లో 129 కోట్లతో 1440 ఫ్లాట్లకు..

  • 29 నుంచి.. ఆగస్టు 19 వరకు టెండర్ల స్వీకరణ

  • ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తొలిసారి ఈపీసీ విధానం

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): పట్టణ గృహనిర్మాణ పథకం కింద కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇళ్ల (ఫ్లాట్ల) కేటాయింపు తరువాతే నిర్మాణాలు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యేలోపు టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల వ్యవహారాన్ని కూడా పూర్తిచేసేందుకు హౌసింగ్‌ బోర్డు చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌ మహానగరం పరిధిలోని 24 నియోజకవర్గాల్లో.. ఇప్పటివరకు స్థలాలు గుర్తించిన 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఎల్‌ఐజీ టవర్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. బుధవారం (ఈ నెల 29) నుంచి ఆగస్టు 19 మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లను స్వీకరించనున్నారు. మొత్తం 16 ప్రాంతాల్లో నిర్మించే ఇందిరమ్మ ఎల్‌ఐజీ టవర్లను 10 ప్యాకేజీలుగా విభజించి టెండర్లను ఆహ్వానించారు. ఒక్కో టవర్‌ను స్టిల్ట్‌ + 10 అంతస్తులతో నిర్మించాలని టెండర్‌ నోటీసులో పేర్కొన్నారు. నిర్మాణాన్ని సంప్రదాయ/మోనోలిథిక్‌ కాంక్రీట్‌ నిర్మా ణం లేదా మరేదైనా వినూత్న సాంకేతికత (షీర్‌వాల్‌ టెక్నాలజీ/ప్రీకాస్ట్‌ టెక్నాలజీ లేదా తెలంగాణ హౌసింగ్‌ బోర్డు ఆమోదించిన విధంగా)తో ఒక్కో ఫ్లాట్‌ను 528.58 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని పేర్కొన్నారు. దీంతోపాటు నేల పరిస్థితులకు తగిన పునాదులు, సివిల్‌ పను లు, అంతర్గత మౌలిక సదుపాయాల కింద నీటి సరఫరా, శానిటరీ ఫిట్టింగ్‌లు, అంతర్గత విద్యుదీకరణ, లిఫ్టులు, ఫైర్‌ సేఫ్టీతో నిర్మాణాలు ఉండాలని టెండర్‌ నోటీ్‌సలో పొందుపరిచారు. అంతేకాకుండా.. ఈ పనులన్నింటికీ రెండేళ్ల డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ (నిర్మాణంలో ఏవైనా లోపాలు, తప్పులు ఉంటే వాటికి నిర్మాణ సంస్థే బాధ్యత వహించే) నిబంధనను కూడా పెట్టారు. జీహెచ్‌ఎంసీ లైసెన్స్‌ ఉన్న బిల్డర్లు ఈ టెండర్లలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తొలిసారిగా ఇంజనీరింగ్‌-ప్రొక్యూర్‌మెంట్‌-కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ విధానం ఎక్కువగా జాతీయ రహదారులు, రాష్ట్రంలోని ప్రత్యేక కారిడార్ల నిర్మాణంలో ఉంటుంది. త్వరితగతిన నిర్మాణం, నాణ్యతతో ఉండేందుకే ఈపీసీ పద్ధతిని తీసుకొస్తున్నట్టు హౌసింగ్‌ బోర్డు ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు తెలిపారు. హౌసింగ్‌ బోర్డు టెండర్‌ నోటీ్‌సలో ఇచ్చిన ప్యాకేజీల ప్రకారం.. ఒక్క హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే దాదాపు 3,500 ఫ్లాట్లు రానున్నాయి. ఆ తరువాత రంగారెడ్డి జిల్లాకు 1,920, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాకు 1,920 చొప్పున ఫ్లాట్లు దక్కనున్నాయి.


తొలి విడతలోని 10 ప్యాకేజీలు ఇవే..

  • ప్యాకేజీ-1లో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లిలో 480 ఫ్లాట్లు, మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్‌ మండలంలోని జల్‌పల్లి వద్ద 480 ఫ్లాట్లు కలిపి మొత్తం 960 ఫ్లాట్లకు రూ.86.40 కోట్లతో టెండర్‌ ఇచ్చారు.

  • ప్యాకేజీ-2లో హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని నాంపల్లి వద్ద ఉన్న రెడ్‌హిల్స్‌లో 480 ఫ్లాట్లు, కుల్సుంపురలో 480, బహదూర్‌పురలోని ముసలైగూడలో 480 ఫ్లాట్లు కలిపి మొత్తం 1440 ఫ్లాట్లకు రూ.129.60 కోట్లతో టెండర్‌. (అన్ని ప్యాకేజీల్లో ఇదే అత్యధికం).

  • ప్యాకేజీ-3లో రూ.86.40 కోట్లతో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో 480 ఫ్లాట్లు, షేక్‌పేట మండలంలోని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో 360 ఫ్లాట్లు, హకీంపేట దర్గాలో 120 ఫ్లాట్లు.

  • ప్యాకేజీ-4: హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని సైదాబాద్‌ మండలం గడ్డిఅన్నారంలో 480 ఫ్లాట్లు, అంబర్‌పేట మండలంలోని అంబర్‌పేట సీపీఎల్‌లో 480 ఫ్లాట్లకు రూ.86.40 కోట్లతో టెండర్‌.

  • ప్యాకేజీ-5: రూ.55.80 కోట్లతో బేగంపేట మండలంలోని పాటిగడ్డలో 480 ఫ్లాట్లు, తిరుమలగిరి మండలంలోని బోయిన్‌పల్లిలో 140 ఫ్లాట్లు.

  • ప్యాకేజీ-6: రూ.43.20 కోట్లతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండలంలోని కేపీహెచ్‌బీ కాలనీలో 480 ఫ్లాట్లు.

  • ప్యాకేజీ-7: రూ.43.20 కోట్లతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలంలోని గాజులరామారంలో 480 ఫ్లాట్లు.

  • ప్యాకేజీ-8: రూ.43.20 కోట్లతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలంలోని కౌకూర్‌లో 480 ఫ్లాట్లు.

  • ప్యాకేజీ-9: రూ.43.20 కోట్లతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలోని పోచారం ఎల్‌ఐజీ కాలనీలో 480 ఫ్లాట్లు.

  • ప్యాకేజీ 10: రూ.43.20 కోట్లతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని బండ్లగూడ ఎల్‌ఐజీ కాలనీలో 480 ఫ్లాట్లు.

Updated Date - Jul 27 , 2026 | 05:52 AM