వాట్సాప్‌లో ట్రాఫిక్ చలాన్లు
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:33 AM
కొందరు ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తుంటారు. పోలీసులు చలాన్లు విధిస్తే.. ‘అవి మాకు అందలేదు..
ఫోన్‌కు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా కూడా చేరవేత
చలాన్ వ్యవస్థ పూర్తిగా ఆన్‌లైన్ రూపంలోకి మార్పు..
హైదరాబాద్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): కొందరు ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తుంటారు. పోలీసులు చలాన్లు విధిస్తే.. ‘అవి మాకు అందలేదు.. మేం చలాన్ ఎందుకు కట్టాలి?’ అని వాదిస్తుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు విధించే చలాన్లు ఆన్‌లైన్‌లో వెంటనే వాహనదారుడి ఫోన్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్, వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో అందించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ట్రాఫిక్ చలాన్ వ్యవస్థను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చే చర్యలు చేపట్టింది. ఇందుకోసం కేంద్ర మోటార్ వెహికిల్ రూల్స్ 1989లోని రూల్ 167ను సవరించింది. గత సోమవారం ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికా్‌సరాజ్ ఉత్తర్వులు జారీచేయగా, మంగళవారం గెజిట్‌లో కూడా సవరణ రూల్స్‌ను ప్రచురించారు. దీని ప్రకారం ఒక నెలలోపు వాహనదారులంతా తమ ఫోన్ నెంబర్‌ను, ఈ-మెయిల్‌ను ‘వాహన్’ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవాలి. గడువులోగా అప్‌డేట్ చేసుకోకుంటే.. ఆ తర్వాత వాహనంపై విధించే చలాన్లు ఆ వాహనం యజమానికి చేరకపోయినా చేరినట్లుగానే భావిస్తారు. ట్రాఫిక్ చలాన్లపై వివాదాలను నివారించేందుకు, వేగంగా చలాన్లు చేరవేసేందుకే ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఫిర్యాదుల కోసం ప్రత్యేక అధికారులు..
ట్రాఫిక్ చలాన్లపై అభ్యంతరాలుంటే వాహనదారులు ఫిర్యాదులు చేసేందుకు కూడా ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సెల్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్లపై ఫిర్యాదు చేసేందుకు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులను, ఆర్టీఏ అధికారులు విధించే చలాన్లపై ఫిర్యాదులకు ఆ విభాగం అధికారులనే వేర్వేరుగా రిడ్రెస్సల్ అధికారులుగా నియమించింది. హైదరాబాద్, సైబరాబాద్, మ ల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్లపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆయా కమిషనరేట్ల పరిధిలో పనిచేసే ట్రాఫిక్ డీసీపీలు రిడ్రెస్సల్ అథారిటీలుగా పనిచేస్తా రు. ఇతర కమిషనరేట్లు, జిల్లాల్లో అదనపు డీసీపీలు, అదనపు ఎస్పీలు, ఎస్పీలు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆర్టీఏ విభాగం లో రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు విధించే చలాన్లపై డి ప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు గ్రీవెన్స్ రిడ్రెస్సల్ అథారిటీలుగా వ్యవహరిస్తారు. మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు విధించే చలాన్లపై ఫిర్యాదుల పరిష్కారానికి ఆర్టీవోలు, డీటీవోలు రిడ్రెస్సల్ అథారిటీలుగా ఉంటారు. అయితే, వాహనదారులు త మ ఫిర్యాదులను విధిగా ఆన్‌లైన్‌లోనే ప్రత్యేక పోర్టల్‌లో సమర్పించాల్సి ఉంటుంది. వీటిని రూ ల్ 167లో నిర్దేశించినగడువులోగా అధికారులు పరిష్కరించి, ఫిర్యాదుదారుడికి సమాచారం ఇ వ్వాల్సి ఉంటుంది. ఇటు కేంద్ర రోడ్డు రవాణా శా ఖ పరిధిలోని ‘సారథి-వాహన్ ఈ చలాన్’ వ్యవస్థలోకి 6 నెలల్లో పూర్తిగా మారిపోవాలని ట్రాఫి క్, ఆర్టీఏ విభాగాలను ప్రభుత్వం ఆదేశించింది.