Vehicle Tax: కొత్త బైక్‌పై 2 వేలు సెస్సు
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:47 AM
కొత్తగా బైక్ కొంటే ఇకపై రూ.2 వేలు సెస్సు కట్టాలి. కారు కొంటే రూ.5వేలు.. భారీ వాహనాలైతే రూ.10 వేలు చెల్లించాలి.
కారుకు రూ.5 వేలు.. భారీ వాహనానికి రూ.10 వేలు
రహదారి భద్రతా సెస్సు వసూలుకు సర్కారు నిర్ణయం.. అసెంబ్లీలో బిల్లు
ప్రమాదాల నివారణకు సుప్రీం ఆదేశాల మేరకు నిర్ణయం.. ఏటా 300 కోట్ల రాబడి
తేలికపాటి రవాణా వాహనాల త్రైమాసిక పన్ను.. లైఫ్ ట్యాక్స్‌గా మార్పు
హైదరాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): కొత్తగా బైక్ కొంటే ఇకపై రూ.2 వేలు సెస్సు కట్టాలి. కారు కొంటే రూ.5వేలు.. భారీ వాహనాలైతే రూ.10 వేలు చెల్లించాలి. ఇదంతా అదనపు భారమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాహన కొనుగోలుదారుల నుంచి రహదారి భద్రతా సెస్సు (రోడ్ సేఫ్టీ సెస్సు) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును శుక్రవారం సభలో ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లుపై జరిగిన చర్చలో శాసనసభ, మండలిలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుండగా ఈసారి మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, ఆదేశాలు అమలులో భాగంగానే రహదారి భద్రతా సెస్సును వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై కొనుగోలు చేసే కొత్త ద్విచక్ర వాహనాలపై రూ.2 వేలు, కార్లపై రూ.5 వేలు, భారీ వాహనాలపై రూ.10 వేల చొప్పున రోడ్డు భద్రతా సెస్సును విధించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంది. సరుకు వాహనాలపై ఇప్పటివరకు వసూలు చేస్తున్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)గా 7.5 శాతం వసూలు చేస్తామన్నారు. లైసెన్స్ విధానాన్ని కఠినతరం చేస్తున్నామని, డ్రైవింగ్ నైపుణ్యాలు గుర్తించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించి, మరణాలను తగ్గించడమే లక్ష్యంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
సర్కారుకు రూ.300 కోట్ల వరకూ ఆదాయం
వాహనాలపై లైఫ్ ట్యాక్స్‌ను పెంచుతూ గత ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రహదారి భద్రత సెస్సును ప్రవేశపెట్టింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇది అదనపు భారంగా మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాలలు కలిపి ఏటా 9 లక్షల వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. అంటే రహదారి భద్రతా సెస్సు వసూలుతో ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది. వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే వాహనాలు, ఆటోల వంటి వాటికి మినహాయింపు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రిజస్టరయ్యే వాహనాల్లో సగానికిపైగా ద్విచక్ర వాహనాలే ఉంటున్నాయి. దీంతో బండి కొనుగోలు చేసే సమయంలో 2 వేలు అదనపు భారం, చిన్న కార్లు కొనుగోలు చేసే కుటుంబాలపై 5వేల భారం పడుతుంది.
త్రైమాసిక ట్యాక్స్ నుంచి లైఫ్ ట్యాక్స్..
ప్రస్తుతం తేలికపాటి రవాణా వాహనాల నుంచి వసూలు చేస్తున్న త్రైమాసిక పన్నును లైఫ్ ట్యాక్స్‌గా మార్చారు. వాహనం ఇదివరకే రిజిస్ట్రేషన్ అయినా, ఇతర రాష్ట్రం నుంచి తెలంగాణలోకి తెచ్చి రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి మూడేళ్ల కంటే తక్కువ సమయం అయితే వాహన ధరలో 6.5ు పన్ను వసూలు చేయనున్నారు. 3 నుంచి 6 ఏళ్ల మధ్య వాహనానికి 5ు, 6 ఏళ్ల కంటే ఎక్కువ కాలమైన వాహనాలకు 4ు పన్నుగా నిర్ణయించారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే కేరళ, కర్ణాటకసహా పలు రాష్ట్రాల్లో కొత్త వాహనాలు తొలి సారి రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే రహదారి భద్రత సెస్సును వసూలు చేస్తున్నాయి.