Share News

వయోవృద్ధుల కమిషన్‌!

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:06 AM

‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ చట్టం-2026’ (టీఈఏఎంపీఎస్‌)లో భాగంగా ‘వయోవృద్ధుల కమిషన్‌’ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో ఒక ప్రధాన కమిషనర్‌, ఇద్దరు కమిషనర్లు ఉంటారు.

వయోవృద్ధుల కమిషన్‌!

  • ఒక ప్రధాన కమిషనర్‌, ఇద్దరు కమిషనర్లతో..

  • తల్లిదండ్రుల పోషణ చట్టంతో ఏర్పాటు

  • అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం

  • పట్టించుకోవటం లేదని కన్నవారు ఫిర్యాదు

  • చేస్తే ఉద్యోగి జీతంలో 10 వేల దాకా కోత

  • ఆ డబ్బు తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ

  • కుటుంబ విలువల పరిరక్షణకే బిల్లు: సర్కారు

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ చట్టం-2026’ (టీఈఏఎంపీఎస్‌)లో భాగంగా ‘వయోవృద్ధుల కమిషన్‌’ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో ఒక ప్రధాన కమిషనర్‌, ఇద్దరు కమిషనర్లు ఉంటారు. ఈ మేరకు టీఈఏఎంపీఎస్‌ బిల్లు-2026ను శనివారం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో పలు అంశాలను పొందుపర్చింది. తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే ఉద్యోగుల వేతనాల నుంచి గరిష్ఠంగా రూ.10 వేల మేర కోత విధించి, తల్లిదండ్రుల పోషణ నిమిత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. తల్లిదండ్రుల యోగక్షేమాలను చూడడం, వారికి సేవలు చేయడం పిల్లల బాధ్యత అని, ఇది భారతీయ కుటుంబ వ్యవస్థలో ప్రధానమైన అంశమని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలహీనమైపోతోందని, పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చూపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే.. కుటుంబ విలువలను సంరక్షించడానికి అవసరమైన ప్రమాణాలను రూపొందించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలిపింది. తల్లిదండ్రుల యోగక్షేమాలను నిర్లక్ష్యం చేస్తున్న ఉద్యోగుల్లో నైతిక బాధ్యతను పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తించి, ఈ నూతన చట్టాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది. నిర్లక్ష్యానికి గురయ్యే తల్లిదండ్రుల పోషణ కోసం ఉద్యోగి నెలవారి జీతం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు (ఏది తక్కువైతే అది) మినహాయించి తల్లిదండ్రులకు చెల్లించడం జరుగుతుందని వివరించింది.


ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, పంచాయతీరాజ్‌ చట్టం, మునిసిపల్‌ చట్టం కింద పని చేసే సిబ్బంది, ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు ఆయా శాఖలు, సంస్థలు తమ ఉద్యోగులకు సంబంధించిన నియమాలను సవరించుకోవాలని సూచించింది. ఈ చట్టం ఎలా అమలవుతుందన్న దానిని కూడా ప్రభుత్వం బిల్లులో విశదీకరించింది. తమ బాగోగులను పట్టించుకోని పిల్లలపై తల్లిదండ్రులు ఇద్దరుగానీ ఒక్కరుగానీ.. వారి పిల్లలు పని చేసే శాఖ విభాగాధిపతికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ అధికారి 60 రోజుల్లోగా ఫిర్యాదును పరిష్కరించాలి. అక్కడ పరిష్కారం కాకపోతే తల్లిదండ్రులు ‘వయోవృద్ధుల కమిషన్‌’కు ఫిర్యాదు చేయవచ్చు. కమిషన్‌ ఆ ఫిర్యాదును 45 రోజుల్లో పరిష్కరించాలి. ఈ కమిషన్‌కు ప్రధాన కమిషనర్‌గా ఉన్నత న్యాయస్థానాల్లో పని చేసి, పదవీ విరమణ పొందిన వ్యక్తిని నియమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో కమిషనర్లు, డైరెక్టర్ల హోదాలో పని చేసి, న్యాయశాస్త్రం, పరిపాలనలో అవగాహన, సమాజ సేవా స్ఫూర్తి కలిగి ఉన్నవారిని కమిషనర్లుగా నియమిస్తారు. ప్రధాన కమిషనర్‌, కమిషనర్ల పదవీ కాలం మూడేళ్ల పాటు ఉంటుంది. 65 ఏళ్ల వయసు నిండేవరకు పదవిలో కొనసాగవచ్చు. కాగా బిల్లులో కొన్ని పదాలకు వివరణ ఇచ్చారు. తగిన ఆదాయం లేనివారు, తమను తాము పోషించుకోలేని వారిని ఆధారపడిన తల్లిదండ్రులుగా నిర్వచించారు. ఆహారం, ఆశ్రయం, దుస్తులు, వైద్య చికిత్సలు మొదలైన వాటిని ప్రాథమిక అవసరాలుగా పేర్కొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 06:07 AM