Share News

డిగ్రీలో కొత్త కోర్సులపై స్పష్టత

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:19 AM

డిగ్రీలో కొత్త కోర్సులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రాష్ట్రంలోని 5 యూనివర్సిటీల పరిధిలో ఈ కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

డిగ్రీలో కొత్త కోర్సులపై స్పష్టత

  • మూడో విడత దోస్త్‌ నుంచి 64 కాలేజీల్లో అందుబాటులోకి..

  • ఉస్మానియా పరిధిలో 17 కాలేజీల్లో బీకాం డిజిటల్‌ కామర్స్‌

  • బీటెక్‌కు సమానంగా డాటా సైన్స్‌తో బీఎస్సీ నాలుగేళ్ల కోర్సు

  • బీకాం, బీఎస్సీతో పాటు బీఏలో కూడా పలు కొత్త కోర్సులు

హైదరాబాద్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): డిగ్రీలో కొత్త కోర్సులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రాష్ట్రంలోని 5 యూనివర్సిటీల పరిధిలో ఈ కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి గత కొద్ది నెలలుగా కసరత్తు చేసిన సంగతి తెలిసిందే. పరిశ్రమ వర్గాలతో పలు సమావేశాలు నిర్వహించి కొత్త కోర్సులకు రూపకల్పన చేసింది. మూడేళ్ల డిగ్రీలో 30 కోర్సులు ప్రారంభించాలని భావించినప్పటికీ ఏఐసీటీఈ, యూజీసీ అనుమతులు లేవంటూ విద్యా శాఖ ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ తొలి రెండు విడతల్లో కొత్త కోర్సులను ప్రకటించలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో దోస్త్‌ మూడో విడతలో ప్రదర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని 36 కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో బీకాం (డిజిటల్‌ కామర్స్‌) అత్యధికంగా 17 కాలేజీల్లో ఉంది. ఈ కోర్సులో ఈ-కామర్స్‌, ఎం-కామర్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఉన్నాయి. బీటెక్‌కు సమానంగా బీఎస్సీ (డేటా సైన్స్‌, ఏఐ, ఎంఎల్‌) నాలుగేళ్ల కోర్సు ప్రవేశపెట్టారు. ఇది 7 కాలేజీల్లో ఉంది. బీకాం (ఫైనాన్స్‌ టెక్నాలజీ) 7 కాలేజీల్లో, బీకాం (ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌) 2 కాలేజీల్లో, బీఎస్సీ (డిజిటల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ నాలుగేళ్ల కోర్సు, బీఏ (ల్యాండ్‌ అగ్రికల్చర్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌), బీఏ (డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌) ఒక్కో కాలేజీలో ఉన్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని 8 కాలేజీల్లో బీఏ (సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ గవర్నమెంట్‌), బీఏ (డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌) కోర్సులు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 8 కాలేజీల్లో, తెలంగాణ వర్సిటీ పరిధిలోని 6, పాలమూరు వర్సిటీ పరిధిలోని 6 కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీలో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కాగా, దోస్త్‌ మూడో విడత దరఖాస్తు గడువు ఈ నెల 21 వరకు ఉంది. ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండాలన్న లక్ష్యంగా ఈ కోర్సులను రూపొందించామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిస్టారెడ్డి తెలిపారు. దోస్త్‌ మూడో విడత కౌన్సెలింగ్‌ నుంచి ఈ కొత్త కోర్సుల్లో చేరవచ్చని పేర్కొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 04:19 AM