చేయూతకు స్వీయ ధ్రువీకరణ
ABN , Publish Date - May 17 , 2026 | 06:01 AM
చేయూత పెన్షన్ల విషయంలో రాష్ట్రంలో భారీ ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టింది. పెన్షనర్ల జాబితా మృతుల పేర్లును తొలగించే పనిని ప్రారంభించింది.
లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్ తప్పనిసరి.. 15 నుంచే ప్రారంభమైన ప్రక్రియ
వచ్చేనెల 15వ తేదీ వరకు కొనసాగింపు
వేలిముద్రలు, ముఖ గుర్తింపు సేకరణ
చనిపోయిన లబ్ధిదారులను తొలగించడమే లక్ష్యం
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): చేయూత పెన్షన్ల విషయంలో రాష్ట్రంలో భారీ ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టింది. పెన్షనర్ల జాబితా మృతుల పేర్లును తొలగించే పనిని ప్రారంభించింది. ఇందుకోసం లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. చేయూత లబ్ధిదారులు తాము జీవించే ఉన్నామని వేలిముద్ర, ముఖ గుర్తింపు ద్వారా నిరూపించుకోవాలి. అందుకోసం ప్రతీ లబ్ధిదారు సమీపంలోని క్షేత్రస్థాయి సిబ్బంది వద్దకు వెళ్లి తమ వివరాలను ఇవ్వాలని ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీనే ప్రారంభమైంది. వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం పది విభాగాల్లో చేయూత పెన్షన్లు ఇస్తున్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బోదకాలు, కిడ్నీ డయాలసిస్ రోగులకు ఈ పెన్షన్లు అందిస్తున్నారు. సాధారణ కేటగిరీలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున ఇస్తున్నారు. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రతినెలా సుమారు రూ.950 నుంచి రూ.1,000 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. చేయూత పథకానికి బడ్జెట్‌లో రూ.14,861 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద 42.23 లక్షల పెన్షన్లు పొందుతున్నారు.
దుర్వినియోగాన్ని అరికట్టేందుకే..
చేయూత పెన్షన్లు కొన్నిచోట్ల పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా లబ్ధిదారులు మరణించిన తర్వాత కూడా వారి బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి. వారి కుటుంబీకులు, బంధువులు ఈ సొమ్మును తీసేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల్లో ఎంతమంది మరణించారనే లెక్క తేల్చాలని సర్కారు నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించింది. లబ్ధిదారులు బతికుంటే లైవ్ అథెంటికేషన్ ద్వారా ధ్రువీకరించుకోవాలి. పట్టణాల్లో వార్డు అధికారులు, పల్లెల్లో పంచాయతీ కార్యదర్శులకు ఈ బాధ్యతను సర్కారు అప్పగించింది. ఆధార్ కార్డు, పెన్షన్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దాన్ని తీసుకొని చేయూత లబ్ధిదారులు సర్కారు నిర్వహించే లైవ్ అథెంటికేషన్ శిబిరాలకు హాజరుకావాలి. గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల వద్ద దీన్ని నిర్వహిస్తున్నారు. నగరాలు, మునిసిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల వారీగా శిబిరాలను ఏర్పాటు చేశారు. గతంలో పెన్షన్ తీసుకున్నవారు తాము బతికే ఉన్నామని నిరూపించేందుకు సమీపంలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లి, అక్కడ లైవ్ సర్టిఫికేట్స్ పొందేవారు. ఈ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తాజాగా వేలిముద్ర, ముఖ గుర్తింపు ద్వారా అసలైన లబ్ధిదారులను గుర్తిస్తోంది. జూన్ 2 నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు అందించనున్న నేపథ్యంలో ముందుగా అనర్హులను ఏరి వేయాలని సర్కారు భావిస్తోంది.