Share News

ఇంటర్‌ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్‌

ABN , Publish Date - May 15 , 2026 | 04:34 AM

ఇంటర్మీడియట్‌ విద్యలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విద్యా విధానం, పరీక్షల్లో మార్పులకు సంబంధించి గతంలో ఇంటర్‌ బోర్డు చేసిన ప్రతిపాదనలకు గురువారం ఆమోదం తెలిపింది.

ఇంటర్‌ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్‌

  • మ్యాథమెటిక్స్‌, హ్యుమానిటీస్‌, లాంగ్వేజెస్‌‌లో కూడా

  • క్రియాశీల అభ్యాసన విధానానికి (ఏబీఎల్‌కు) 20శాతం మార్కులు

  • వార్షిక రాతపరీక్షకు 80శాతం మార్కులు

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ విద్యలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విద్యా విధానం, పరీక్షల్లో మార్పులకు సంబంధించి గతంలో ఇంటర్‌ బోర్డు చేసిన ప్రతిపాదనలకు గురువారం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ప్రయోగ విద్య (ప్రాక్టికల్స్‌) ద్వితీయ సంవత్సరం (సెకండియర్‌) ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మాత్రమే ఉండగా.. ఇకపై ప్రథమ సంవత్సరం (ఫస్టియర్‌) విద్యార్థులకు కూడా తప్పనిసరి చేసింది. అంతేకాదు ఇకపై మ్యాథమెటిక్స్‌తోపాటు అన్ని సబ్జెక్టులు, లాంగ్వేజెస్‌‌లోనూ ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలివీ..

  • ఇప్పటివరకు ఇంటర్‌ సెకండియర్‌లో భౌతిక, రసాయన, వృక్ష, జంతు శాస్త్రాల్లోనే ప్రాక్టికల్స్‌ ఉన్నాయి. ఇకపై ఫస్టియర్‌ వారికీ ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ప్రథమ సంవత్సరంలో 15, ద్వితీయ సంవత్సరంలో 15 మార్కులకు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. వార్షిక రాతపరీక్ష 60 మార్కులకు ఉంటుంది.

  • ఇక నుంచి ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాలు రెండింటిలోనూ కొత్తగా ప్రాక్టికల్స్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటివరకు మొత్తం 75మార్కులకు రాతపరీక్ష ఉండేది. కొత్త విధానంలో 15 మార్కులను ఏబీఎల్‌ (యాక్టివ్‌ బేస్డ్‌ లెర్నింగ్‌ - క్రియాశీల అభ్యాసన విధానం)కు కేటాయించారు. రాతపరీక్ష 60 మార్కులకు ఉంటుంది.

  • ఫస్టియర్‌, సెకండియర్‌ రెండింటిలోనూ.. కామర్స్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, అకౌంటెన్సీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి సబ్జెక్టులు, తెలుగు, ఇంగ్లిషు, హిందీ, ఉర్దూ లాంగ్వేజె్‌సలోనూ 20శాతం మార్కులను ఏబీఎల్‌కు కేటాయించారు. వీటిలో ఇప్పటివరకు మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష ఉండగా.. ఇకపై 80 మార్కులకు నిర్వహిస్తారు. ఏబీఎల్‌కు 20 మార్కులు ఉంటాయి.

  • ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న ఏసీఈ (అకౌంటెన్సీ, కామర్స్‌, ఎకనామిక్స్‌)లోనూ ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఏబీఎల్‌కు, 80 మార్కులు రాతపరీక్షకు ఉంటాయి.

  • ఇంటర్‌ ఫస్టియర్‌ కోసం ఈ ఏడాది కొత్త పాఠ్యాంశాలతో పుస్తకాలను సిద్ధం చేశారు. ఇంకా ప్రభుత్వ ఆమోదం రాలేదు. ప్రత్యేకంగా నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసి.. సవరించిన కొత్త పాఠ్య పుస్తకాలను ప్రచురించనున్నారు.

Updated Date - May 15 , 2026 | 04:34 AM