Share News

ఇక డిగ్రీ, పీజీల్లో క్రెడిట్‌ విధానం

ABN , Publish Date - Mar 08 , 2026 | 05:35 AM

ఇప్పటివరకు ఇంజనీరింగ్‌ ఇతర వృత్తి విద్య కోర్సుల్లో ఉన్న క్రెడిట్‌ విధానం డిగ్రీ, పీజీ కోర్సుల్లోనూ అమల్లోకి రానుంది.

ఇక డిగ్రీ, పీజీల్లో క్రెడిట్‌ విధానం

  • మూడేళ్ల డిగ్రీకి 120, నాలుగేళ్ల ఆనర్స్‌కు 160, పీజీకి 80 కనీస క్రెడిట్లు

  • ప్రస్తుత గ్రేడింగ్‌ విధానం స్థానంలో...వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు

  • ఉన్నత విద్యామండలి నిర్ణయం

  • డిగ్రీ మధ్యలో ఆపేయవచ్చు.. భవిష్యత్తులో కొనసాగించవచ్చు

  • యూజీ కోర్సుల్లోనూ ఇంజనీరింగ్‌ తరహాలో మైనర్‌ డిగ్రీ

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఇప్పటివరకు ఇంజనీరింగ్‌ ఇతర వృత్తి విద్య కోర్సుల్లో ఉన్న క్రెడిట్‌ విధానం డిగ్రీ, పీజీ కోర్సుల్లోనూ అమల్లోకి రానుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని యూజీ, పీజీ కోర్సుల్లో క్రెడిట్‌ విధానం అమలుచేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇప్పటివరకున్న గ్రేడింగ్‌ విధానం స్థానంలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఉత్తీర్ణత సాధించాలంటే మూడేళ్ల డిగ్రీలో కనీసం 120 క్రెడిట్‌లు, నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీకి 160, పీజీ కోర్సుల్లో ఉత్తీర్ణతకు కనీసం 80 క్రెడిట్లు సాధించాల్సి ఉంటుంది. ఈమేరకు విశ్వవిద్యాలయాలు ఉపకులపతుల (వీసీ)తో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ విధానానికి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వీసీలందరూ ఆమోదం తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాష్ట్రంలోని ఉన్నత విద్యకు సంబంధించిన ముఖ్యమైన విద్యా, విధానపరమైన అంశాలపై చర్చించారు. ఇప్పటివరకు బీటెక్‌లో ఉన్న విధంగా మైనర్‌ డిగ్రీలు, క్రెడిట్‌ నిర్మాణం, క్రెడిట్‌ బదిలీ విధానం, మల్టీడిసిప్లినరీ ప్రోగ్రామ్‌, మల్టిపుల్‌ ఎంట్రీ-మల్టిపుల్‌ ఎగ్జిట్‌ విధానం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించేందుకు సంప్రదాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత విధానంలో యూజీ, పీజీ కోర్సులు మధ్యలో మానేస్తే తర్వాత కొనసాగించలేరు. కొత్తగా అమలు చేయబోయే మల్టీపుల్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ విధానంలో విద్యార్థి డిగ్రీ ప్రథమ సంవత్సరం పూర్తిచేసి మానేస్తే సర్టిఫికెట్‌ కోర్సుగా పరిగణించి పట్టా ఇస్తారు. ద్వితీయ సంవత్సరంలో మానేస్తే డిప్లొమా అందిస్తారు. భవిష్యత్తులో ఎప్పుడైనా తర్వాతి కోర్సు పూర్తిచేసే అవకాశం ఉంటుంది. అది పూర్తిచేసి మూడేళ్ల డిగ్రీ పట్టా పొందవచ్చు.


వచ్చే ఏడాది నుంచి ఎన్‌ఈపీ ప్లస్‌ అమలు

2026-27 విద్యా సంవత్సరం నుంచి యూజీ, పీజీ కోర్సులలో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 ప్లస్‌ విధానాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఎన్‌ఈపీలోని ఉత్తమ విధానాలతోపాటు రాష్ట్ర అవసరాలకు సరిపడే ఇతర విధానాలనూ ఎన్‌ఈపీ ప్లస్‌ పేరుతో అమలు చేస్తామని బాలకిష్టారెడ్డి తెలిపారు. కొత్త మార్పులతో నాణ్యత పెరుగుతుందని, నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ వంటి గుర్తింపు, ర్యాంకింగ్‌ వ్యవస్థల్లో విశ్వవిద్యాలయాలకు మెరుగైన ప్రయోజనాలు లభించడంతో పాటు జాతీయ స్థాయి పోటీ నిధులు, పరిశోధన నిధులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయన్నారు. కాగా 2026-27 విద్యా సంవత్సరానికి కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహణ బాధ్యతను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. అలాగే ‘‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక జూన్‌ 12 వరకు విశ్వవిద్యాలయ స్థాయిలో అమలు చేయాలని ఉపకులపతులను కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ఈ.పురుషోత్తం, ఎస్‌.కె.మహమూద్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగారం, కాకతీయ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కర్నాటి ప్రతాప్‌ రెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ టి.యాదగిరిరావు, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఖాజా ఆల్తాఫ్‌ హుసేన్‌,, పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌, శాతవాహన విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ యు.ఉమేష్‌ కుమార్‌, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ సూర్య ధనంజయ్‌, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 05:35 AM