12నసీఎం చేతుల మీదుగా ఇంటర్ ఫలితాలు
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:57 AM
ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తేదీన విడుదల కానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆదివారం...
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తేదీన విడుదల కానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు కానున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం నూతన సిలబస్ పుస్తకాలను కూడా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. కాగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభమై మార్చి 18వ తేదీన ముగిశాయి. సమాధాన పత్రాల మూల్యాంకనం గత నెలాఖరులోనే ముగిసింది. అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులై కేవలం ఒక సబ్జెక్టులో ఒకటి రెండు మార్కులతో ఫెయిలైన విద్యార్థుల సమాధానపత్రాలను ఈసారి కూడా మళ్లీ మూల్యాంకనం చేశారు. ఆ ప్రక్రియ కూడా ఇటీవలే పూర్తయింది. దాంతో ఫలితాల విడుదల కోసం ఇంటర్‌బోర్డు కసరత్తు పూర్తి చేసింది.