ఇంటర్ కొత్త పాఠ్య పుస్తకాలపై అనిశ్చితి!
ABN , Publish Date - May 15 , 2026 | 04:36 AM
ఇంటర్మీయట్ కొత్త విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభంకానున్న నేపథ్యంలో కొత్త పుస్తకాలు, ఇతర అంశాల పరంగా నిర్ణయాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం విద్యార్థులు....
కొత్త సిలబ్‌సతో ఫస్టియర్ పుస్తకాల ముద్రణ ఇప్పటికే పూర్తి
ఆవిష్కరణ ఎప్పుడు? త్వరలోనే కొత్త విద్యాసంవత్సరం
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన
హైదరాబాద్, మే 14(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీయట్ కొత్త విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభంకానున్న నేపథ్యంలో కొత్త పుస్తకాలు, ఇతర అంశాల పరంగా నిర్ణయాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలను తీవ్ర గందరగోళంలో పడేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అన్ని గ్రూపులకు సంబంధించిన సిలబస్ మారింది. ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్‌లో కొత్త పాఠ్యాంశాలు ఉండాలన్న ప్రతిపాదనకు సీఎం రేవంత్ నిరుడు అక్టోబరులోనే అనుమతించారు. అనంతరం అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాల మార్పులపై సంబంధిత విషయనిపుణుల సలహాలు, సూచనలతో సవరణ ప్రక్రియ ప్రారంభించారు. ఆ మేరకు సవరించిన సిలబస్ ఆధారంగా కొత్త పాఠ్య పుస్తకాల ముద్రణ కూడా పూర్తయింది. కొత్త సిలబ్‌సతో కూడిన పుస్తకాలను ఇంటర్ ఫలితాల రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయాలని తొలుత అధికారులు భావించారు. సీఎం కార్యక్రమం రద్దవడంతో ఫలితాలను కేశవరావు విడుదల చేశారు. అయితే ఆ రోజు కొత్త సిలబ్‌సపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. పుస్తకాల ముద్రణ పూర్తయ్యాక ప్రభుత్వం పలు అంశాలపై ఇంటర్ బోర్డును వివరణ కోరింది. పాఠ్యాంశాల రూపకల్పనలో జాతీయ విద్యావిధానం మార్గదర్శకాల అమలు, టెండరు వివరాలు తెలపాలని కోరగా బోర్డు సమాధానమిచ్చింది. ఆ తర్వాత కూడా కొత్త పుస్తకాల విడుదలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.