Share News

11 లక్షలతో ఒక్కో ఇల్లు

ABN , Publish Date - Jul 21 , 2026 | 04:59 AM

కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూర్‌ పరిధిలోని 24 నియోజకవర్గాలకుగాను తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో..

11 లక్షలతో ఒక్కో ఇల్లు

  • ప్రభుత్వ వాటా రూ.5 లక్షలు.. రిజిస్ట్రేషన్‌ ఉచితం

  • లబ్ధిదారుల వాటా రూ.6 లక్షలు

  • నాలుగు దఫాల్లో చెల్లించేలా వెసులుబాటు

  • 528 చ.అడుగుల ఫ్లాట్‌.. క్యూర్‌లో ఇందిరమ్మ ఇళ్లకు విధివిధానాలు

  • నేటి నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు

  • ఆన్‌లైన్‌, వాట్సాప్‌ ద్వారా అవకాశం

  • ఫీజు రూ.100.. ఈఎండీ రూ.10 వేలు

  • 24 నియోజకవర్గాల్లో లక్ష ఎల్‌ఐజీ ఇళ్లు

  • బహుళ అంతస్తుల విధానంలో నిర్మాణం

  • తొలి దశలో 16 సెగ్మెంట్‌ల్లో 480 ఇళ్ల చొప్పున

  • వచ్చే ఏడాది ఈ ఇళ్లనుంచే బోనాలు: పొంగులేటి

‘‘మేము మాటలు చెప్పే వాళ్లం కాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. చేసి చూపించే ప్రభుత్వం మాది. పేదల కష్టం తెలిసిన ప్రజా ప్రభుత్వం ఇది. అందుకే మా ప్రభుత్వం రాగానే ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకాన్ని ప్రారంభించాం. ఈ రెండున్నరేళ్లలో ఇప్పటివరకు 7లక్షలకు పైగా ఇళ్లను గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు ఉన్నవారికి మంజూరు చేశాం. ఇప్పుడు స్థలాలు లేని అల్పాదాయ వర్గాలకు ఇళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో క్యూర్‌ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 10 అంతస్తుల్లో భవనాలు నిర్మించి, పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టాం. అర్బన్‌ హౌసింగ్‌ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వచ్చే ఏడాది బోనాల వరకు పూర్తి చేస్తాం. వచ్చే ఏడాదిలో ఈ ఇళ్ల నుంచే బోనమెత్తుతాం’’

- మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూర్‌ పరిధిలోని 24 నియోజకవర్గాలకుగాను తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున నిర్మాణం చేపట్టనుంది. బహుళ అంతస్తుల విధానంలో నిర్మించే ఈ ఇళ్లను ఫ్లాట్‌ల రూపంలో లబ్ధిదారులకు అందించనుంది. ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం 528 చదరపు అడుగులు ఉండనుండగా.. దీని నిర్మాణ వ్యయం రూ.11 లక్షలు కానుంది. ఇందులో రూ.5 లక్షలు ప్రభుత్వ వాటా కాగా, రూ.6లక్షలు లబ్ధిదారుల వాటాగా నిర్ణయించారు.


అయితే ఈ రూ.6 లక్షలను నాలుగు విడతలుగా చెల్లించే వెసులువాటు కల్పించనున్నారు. మొత్తంగా ఒక్కో చదరపు అడుగుకు రూ.1,136 చొప్పున ధరకు లబ్ధిదారులకు ఇళ్లు అందనున్నాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విధివిధానాలు, అర్హతలు, మార్గదర్శకాలను సోమవారం సచివాలయంలో క్యూర్‌ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు, హౌసింగ్‌ శాఖ కమిషనర్‌ వి.పి.గౌతమ్‌తో కలిసి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. క్యూర్‌ పరిధిలో తొలి విడతగా ఇప్పటికే స్థలాలు గుర్తించిన 16 నియోజకవర్గాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ ఇళ్ల కోసం దరఖాస్తులను ఈ నెల 21 నుంచి ఆగస్టు 10 వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ హౌసింగ్‌ బోర్డు వెబ్‌సైట్‌, మీ-సేవ, వాట్సాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. దరఖాస్తు ఫీజు రూ.100, ఇంటి (టోకెన్‌ అడ్వాన్స్‌) ఈఎండీ రూ.10 వేలు కలిపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక లాటరీ విధానంలో ఇళ్లను కేటాయిస్తామని, ఇల్లు దక్కనివారికి దరఖాస్తు ఫీజు మినహా ఈఎండీ నగదును వెంటనే చెల్లిస్తామని అన్నారు. కాగా, ఇంటి రిజిస్ట్రేషన్‌ను లబ్ధిదారు పేరుపై ఉచితంగా చేస్తున్నామని, అయితే 10 ఏళ్లు ఇంటిని విక్రయించుకునే అవకాశం లేదని చెప్పారు. రుణాల కోసం మాత్రం బ్యాంకుల్లో ఆ సేల్‌డీడ్‌ను పెట్టుకోవచ్చన్నారు. గతంలో ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రయోజనం పొందినా ఈ పథకం వర్తించబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులను 360 డిగ్రీల కోణంలో పరిశీలించాకే ఆమోదిస్తామన్నారు. తొలి విడతలో 7,680 ఫ్లాట్లను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.


ఒక్కో ఫ్లాటు 528 చదరపు అడుగుల్లో..

గుర్తించిన నియోజకవర్గాల్లో 10 అంతస్తుల్లో భవనాలను నిర్మించనున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. అందులో ఒక్కో ఫ్లాటు (హాలు, ఒక బెడ్‌రూమ్‌, కిచెన్‌, టాయిలెట్‌) కలిపి 528 చదరపు అడుగులు ఉంటుందన్నారు. గత పాలకుల అనాలోచిన నిర్ణయంతో హైదరాబాద్‌కు 30-35 కిలోమీటర్ల దూరంలో ఇళ్లను నిర్మించడం వల్ల తమ జీవనోపాధికి ఇబ్బందిగా మారిందన్న ఉద్దేశంతో లబ్ధిదారులెవరూ ఆ ఇళ్లలోకి వెళ్లలేదన్నారు. కేవలం 8-9వేల మంది మాత్రమే ఆ నివాసాల్లోకి వెళ్లారని, మిగిలిన వారు మంజూరు పత్రాలు మాత్రమే తీసుకున్నారని వెల్లడించారు. క్యూర్‌ పరిధిలోని 24 నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా తీసుకుని, ఆ నియోజకవర్గంలో ఉంటున్న వారికి అక్కడే ఇల్లు అందించేలా బహుళ అంతస్తుల విధానంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు వివరించారు. రూ.100-200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో పేదలకు ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని, ఇంటితోపాటు ఇంటి కింద వచ్చే అన్‌డివైడెడ్‌ ల్యాండ్‌ కింద రూ.40-60 లక్షల విలువ చేసే స్థలాన్ని ఆ ఇంటి మహిళ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని చెప్పారు. ఈ స్థలాన్ని కూడా పదేళ్ల పాటు విక్రయించుకునే అవకాశం ఉండదన్నారు. ఇళ్ల కోసం ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గాల వారీగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వార్షిక ఆదాయం రూ.6 లక్షల వరకు ఉండాలన్నారు. రాజకీయం, కులం, మతం అనే బేధం లేకుండా, ఎన్నికల సమయంలో తమ అభ్యర్థికే ఓటు వేయాలన్న షరతు లేకుండా అత్యంత పారదర్శకంగా ఇళ్లను కేటాయించనున్నట్టు స్పష్టం చేశారు.


కేంద్రంలోని బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించడంలేదని చెప్పారు. ఇళ్ల కేటాయింపులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీ-5, బీసీ-16, దివ్యాంగులకు-5, ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్‌/నాలుగో తరగతి ఉద్యోగులు/పారిశుధ్య కార్మికులకు 10 శాతం చొప్పున మొత్తం 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నామని వివరించారు. అయితే ఈ కేటాయింపులన్నింట్లోనూ మహిళలకు 30 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్టు తెలిపారు. మిగిలిన 50 శాతంలో జనరల్‌ క్యాటగిరి/ఇతర దరఖాస్తుదారులకు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. ఇక మధ్య తరగతి వర్గాలకు, జర్నలిస్టులకు త్వరలోనే శుభవార్త చెబుతామన్నారు. కాగా, క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల నిర్ణయం ఒక చరిత్రాత్మక కార్యక్రమమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వంహౌసింగ్‌ శాఖనే రద్దు చేసిందని, తమ ప్రభుత్వం అదే శాఖకు పునర్‌వైభవం తీసుకువచ్చి పేదలకు ఇళ్లను నిర్మించి ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.


10 ఏళ్లుగా నగరంలో ఉంటేనే!

క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే దరఖాస్తుదారులు 10 ఏళ్లుగా హైదరాబాద్‌ (క్యూర్‌) నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు/కుటుంబానికి ఓఆర్‌ఆర్‌/క్యూర్‌ ప్రాంతంలో సొంత ఇల్లు గానీ, ఇంటి స్థలం గానీ, ఫ్లాట్‌ గానీ ఉండరాదు. దరఖాస్తుదారు ఇంతకుముందెప్పుడూ ఇలాంటి గృహ ప్రయోజనం పొంది ఉండకూడదు. దరఖాస్తు చేస్తున్న నియోజకవర్గం/యూనిట్‌ నివాసి అయి ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒకే ఫ్లాట్‌ కోసం దరఖాస్తు చేయాలి.

పథకానికి పేరు పెట్టిన వ్యక్తికి రూ.లక్ష బహుమతి..

క్యూర్‌ పరిధిలో ప్రభుత్వం చేపట్టదలచిన ఇందిరమ్మ లక్ష ఎల్‌ఐజీ ఇళ్ల పథకానికి పేరును సూచించాలంటూ హౌసింగ్‌ బోర్డు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోటీ నిర్వహించింది. మంచి పేరును సూచించిన వారికి రూ.లక్ష బహుమతిని ఇస్తామని ప్రకటించింది. పోటీలో 15 వేలకు పైగా ఎంట్రీలు వచ్చాయి. అందులో నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన కొండా నాగరాజు.. పథకానికి ‘ఇందిరమ్మ ఇండ్లు’ పేరే బాగుందని సూచించారు. దాంతో పథకానికి ఇదే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు నాగరాజుకు రూ.లక్ష చెక్కును మంత్రులు అందజేశారు.

Updated Date - Jul 21 , 2026 | 05:00 AM