హైదరాబాద్‌లో స్థలం ఉంటే నెలాఖరులోగా ఇల్లు మంజూరు
ABN , Publish Date - May 13 , 2026 | 04:13 AM
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవానికి సర్కారు సిద్ధమైంది. జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల మంజూరు ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు..
జూన్ 2న ఆదిలాబాద్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపునకు స్పెషల్ డ్రైవ్: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవానికి సర్కారు సిద్ధమైంది. జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల మంజూరు ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై 21న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో సొంత స్థలం ఉండి, పథకానికి అర్హులైన వారికి మే నెల చివరిలోగా ఇంటి మంజూరు పత్రాలను అందజేస్తామని వెల్లడించారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన హౌసింగ్, రెవెన్యూ అంశాలపై మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి యుద్ధప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. కాలనీలకు 5-8 కిలోమీటర్లలోపు ఉన్న వారినే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం దూరదృష్టి లేకుండా హైదరాబాద్‌కు 20-30 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిందని, దాని వల్ల జరిగిన నష్టం కళ్లముందే కనబడుతోందన్నారు. పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు 5-8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునే విధంగా, నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని స్థలాలు గుర్తించి, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని యూఎల్‌సీ భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రస్తావించగా.. సంబంధిత రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్డీవో, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మంత్రి డి.శ్రీధర్‌బాబు సూచించారు.