Share News

ఎంఐజీ ఇళ్లపై పునరాలోచన!

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:47 AM

రాష్ట్రంలోని పేదలకు ఇందిరమ్మ ఇంటి పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తూనే అల్పాదాయ (ఎల్‌ఐజీ), మధ్య ఆదాయ (ఎంఐజీ) వర్గాలకు కూడా ఇళ్లను సరసమైన ధరలకు..

ఎంఐజీ ఇళ్లపై పునరాలోచన!

  • తొలుత ఎల్‌ఐజీ ఇళ్లకే మొగ్గు.. వాటికి కావాల్సిన భూమి దొరికాకే డిజైన్ల ఖరారు

  • పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి నజర్‌

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేదలకు ఇందిరమ్మ ఇంటి పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తూనే అల్పాదాయ (ఎల్‌ఐజీ), మధ్య ఆదాయ (ఎంఐజీ) వర్గాలకు కూడా ఇళ్లను సరసమైన ధరలకు అందించాలని నిర్ణయించిన సర్కారు.. ఎంఐజీ ఇళ్ల విషయంలో ప్రస్తుతానికి పునరాలోచనలో పడినట్టు తెలిసింది. తొలుత ఎల్‌ఐజీ వర్గాలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని, ఆ తర్వాతే ఎంఐజీ ఇళ్లపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో అఫర్డబుల్‌ అర్బన్‌ హౌసింగ్‌ ప్రోగ్రామ్‌ కింద కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలోని ప్రాంతాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలోని అల్ప, మధ్య అదాయ వర్గాల వారికి లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అది కూడా ఎక్కడో ఓఆర్‌ఆర్‌ అవతలివైపో, లేదా జనావాసాలకు దూరంగానో కాకుండా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోనే నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు భావించింది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల పరిధిలో ఎక్కడెక్కడ ఎంత స్థలం అందుబాటులో ఉంది, అక్కడ ఎల్‌ఐజీ, ఎంఐజీ ఇళ్లకు ఎంత డిమాండ్‌ ఉంటుంది..తదితర అన్ని అంశాలనూ హౌసింగ్‌ బోర్డు పరిశీలిస్తోంది. ఇప్పటికే ఓ 15 చోట్ల స్థలాలను కూడా గుర్తించింది. ఇంకా 9 నియోజకవర్గాల్లో స్థలాలను ఖరారు చేయాల్సి ఉంది. అయితే అన్ని నియోజకవర్గాల్లో స్థలాలు అందుబాటులో లేకపోయినప్పటికీ అపార్ట్‌మెంట్ల డిజైన్లను ఖరారు చేసి, గృహనిర్మాణ శాఖ ఇటీవల సీఎం దగ్గర జరిగిన సమీక్షలో నివేదించింది. అయితే, స్థలాలు ఖరారు కాకుండానే డిజైన్లు ఖరారు చేసి ఉపయోగమేంటని, అన్ని నియోజకవర్గాల్లో స్థలాలు అందబాటులోకి వచ్చాకే డిజైన్లను ఫైనల్‌ చేయాలని అధికారులకు సీఎం సూచించినట్టు సమాచారం.


ఇళ్ల హామీలపై దృష్టి పెట్టాలి..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన సమయంలో, ఎన్నికల ప్రచారంలో.. పేదలకు ఇళ్లు ఇస్తానంటూ తాను ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌ దృష్టి సారించారు. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన హౌసింగ్‌ శాఖ సమీక్షలో అధికారులకు ఆయన పలు కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. ప్రధానంగా యాదాద్రి జిల్లాతో పాటు కరీంనగర్‌ జిల్లాలోని చిన్న ముల్కనూర్‌ ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో పక్కా ఇళ్లను నిర్మిస్తామని చెప్పి ఇళ్లను కూల్చివేసి మళ్లీ నిర్మించలేదని, కనుక అలాంటి వాటిపై దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తిచేయాలని సూచించినట్టు తెలిసింది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్‌ ఎక్కడెక్కడ ఇంటి హామీ ఇచ్చారు, వారిలో ఎంతమందికి ఇళ్లు అందాయి, ఇంకా ఎంతమందికి అందాల్సి ఉంది, అందులో అర్హులు ఉన్నారా అనే వివరాలను సేకరించే పనిలో గృహ నిర్మాణ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే దీనిపై పూర్తినివేదికను సీఎంకు అందించనున్నట్టు తెలిసింది.

Updated Date - Jun 18 , 2026 | 05:47 AM