క్యూర్‌లో ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే
ABN , Publish Date - Jul 23 , 2026 | 06:10 AM
క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్‌ను నిర్మించనున్నట్టు రెవె న్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు.
గృహనిర్మాణ మంత్రి పొంగులేటి స్పష్టీకరణ
ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో
ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తున్నట్లు వెల్లడి
ప్రజలతో ముఖాముఖిలో వినతిపత్రాల స్వీకరణ
హైదరాబాద్, జూలై 22(ఆంధ్రజ్యోతి): క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్‌ను నిర్మించనున్నట్టు రెవె న్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్న పేదలు.. ఈ ఇళ్ల కోసం మరోమారు దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మీసేవ, గృహనిర్మాణ శాఖ వెబ్‌సైట్, వాట్సా్‌పల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గాంధీభవన్‌లో బుధవారం జరిగిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. భూమి, ఇళ్లు, ఇతర సమస్యలపైన బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వాటిలో కొన్ని సమస్యలపై సంబంధిత కలెక్టర్లతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులే ఎక్కువగా వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తమ సొంతింటి కలను నెరవేరుస్తుందన్న ఆశతో ప్రజలు ఉన్నారన్న ఆయన.. వారి ఆశలకు అనుగుణంగా రెండు విడతల్లో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ఇప్పటికి మంజూరు చేసిందని గుర్తుచేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ నగర పేదలకు.. వారు ఉన్న చోట కాకుండా నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు నిర్మించిందని దుయ్యబట్టారు.
తమ జీవనోపాధి దెబ్బతింటుందన్న ఆందోళనతో పేదలు ఆ ఇళ్లల్లో అడుగుకూడా పెట్టలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ క్రమంలో.. పేదవారికి వారు పుట్టి పెరిగిన చోటే నివాసాన్ని కల్పించాలన్న ఆలోచనతో నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఇందిరమ్మ టవర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ టవర్స్‌లో నిర్మించి ఇచ్చే ఇళ్ల విలువ.. ల్యాండ్ షేర్ కలుపుకొని రూ.40 లక్షల నుంచి రూ. కోటి వరకు ఉంటుందని వెల్లడించారు. పదేళ్ల పాటు అమ్ముకోవడానికి వీలు లేకుండా నిబంధన పెట్టి రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఆ ఇళ్లపై బ్యాంకులో రుణం తీసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుందన్నారు. ఇక.. భూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో పరిష్కరించదగిన అన్నింటికీ ప రిష్కారం చూపిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.