Share News

నెలాఖరులోగా లక్ష గృహప్రవేశాలు

ABN , Publish Date - Mar 08 , 2026 | 04:05 AM

సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో జీవిచేలా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ఒక బెంచ్‌ మార్కులా నిలవబోతోంద.

నెలాఖరులోగా లక్ష గృహప్రవేశాలు

  • మంజూరైన ఇందిరమ్మ ఇళ్లన్నీ పూర్తవ్వాల్సిందే

  • అన్ని ఇళ్లకూ చెల్లింపులు పూర్తిచేస్తాం: పొంగులేటి

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్ర జ్యోతి): ‘‘సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో జీవిచేలా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ఒక బెంచ్‌ మార్కులా నిలవబోతోంద. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఇప్పటి వరకు 3.60 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. ఇందులో లక్ష ఇళ్లకు ఈ నెల 31లోపు గృహప్రవేశాలు జరుగుతాయి’’ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలో 99 రోజుల కార్యాచరణపై జిల్లా హౌసింగ్‌ పీడీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి త్వరలోనే గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలను ప్రకటిస్తామన్నారు. ఇళ్లు మంజూరు చేసిన తరువాత కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో పూరిగుడిసెలు కనిపిస్తున్నాయన్నారు. గుడిసెల్లో ఉండే కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేసిన ఇళ్లలో 20 శాతం ఇప్పటికీ ఎలాంటి పనులు చేపట్టలేదని.. ఈనెల 31వ తేదీలోపు లబ్ధిదారుల సమ్మతితో.. స్థానిక నేతల సహకారంతో పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న ఇళ్లు.. జూన్‌ చివరి నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏప్రిల్‌ నెలలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించే సామగ్రి ధరలు పెరగడం వల్ల లబ్ధిదారులపై అదనపు భారం పడకుండా జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు చొరవ తీసుకుని పనిచేయాలని సూచించారు. కలెక్టర్లతో సమీక్షించి సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. నిర్మాణానికి అవసరమైన ఇటుకుల లభ్యత పెంచేందుకు పొదుపు సంఘాల ద్వారా బ్రిక్‌ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి ప్రొత్సహించాలని సూచించారు.


ఇళ్ల లబ్ధిదారులకు వివిధ కారణాలతో నిలిపివేసిన చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు. నిజమైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం ఎట్టి పరస్థితుల్లో నిలిపోవడానికి వీల్లేదన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నా.. లబ్ధిదారుల ఎంపికను మార్చి 31 లోపు పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఇళ్ల స్థలం లేని పేద కుటుంబాలకు ఈ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సంక్షేమ పథకాల విజయవంతానికి సీఎం కార్యదర్శి ఒక్కరే ప్రయత్నం చేయడం సరిపోదని.. ఆ శాఖలోని ప్రతి అధికారి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పని చేసినప్పుడే ఫలితం ఉంటుందన్నారు. అధికారుల సమష్టి కృషి వల్లనే ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశంలోనే అత్యుత్తమ పథకాల్లో ఒకటిగా నిలిచిందన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 04:06 AM