సంక్షేమ శాఖలకు పెరిగిన బడ్జెట్
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:36 AM
అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో సంక్షేమ శాఖలకు గత బడ్జెట్ కంటే ఈసారి నిధుల కేటాయింపు పెరిగింది. షెడ్యూల్డ్ కులాల...
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో సంక్షేమ శాఖలకు గత బడ్జెట్ కంటే ఈసారి నిధుల కేటాయింపు పెరిగింది. షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) అభివృద్ధికి క్రితం బడ్జెట్‌లో రూ.11,561 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ.11,784 కోట్లు, షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) అభివృద్ధికి గత బడ్జెట్‌లో రూ.7,522 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.7,937 కోట్లకు పెంచారు. గత ఏడాదితో పోల్చితే ఈ కేటాయింపుల్లో దాదాపు 12-15 శాతం వృద్ధి కనిపిస్తోంది. వెనుకబడిన తరగతుల(బీసీ) సంక్షేమానికి గతంలో 11,405 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ.12,511 కోట్లకు ప్రతిపాదించారు. మైనార్టీ సంక్షేమానికి గత బడ్జెట్‌లో రూ.3,591 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ.3,769 కోట్లకు పెంచారు. మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖకు గత బడ్జెట్‌లో రూ.2,862 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్‌లో రూ.3,143 కోట్లకు పెంచారు.