ఇక ప్రతి నెలా రూ.1000 కోట్లు!
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:21 AM
రాష్ట్రంలో ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రతి నెలా విడుదల చేస్తున్న మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకూ నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తుండగా..
ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్‌కు ప్రస్తుతం ఇస్తున్న రూ.700 కోట్లను పెంచిన సర్కారు
ఏప్రిల్ నెలకు 1000 కోట్ల విడుదల
జీపీఎఫ్ బిల్లుల క్లియరెన్స్‌కు వినియోగం
స్కాలర్‌షిప్‌ల సమస్యను పరిష్కరిస్తాం: భట్టి
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రతి నెలా విడుదల చేస్తున్న మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకూ నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తుండగా.. దాన్ని రూ.1000 కోట్లు చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.1000 కోట్లను విడుదల చేసింది. ఇకపై ప్రతి నెలా ఇంతే మొత్తం విడుదల చేస్తామని ప్రకటించింది. ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు, జీపీఎఫ్, టీజీఎల్‌ఐసీ, కమ్యూటేషన్, ఆర్జిత సెలవుల ఎన్‌క్యా్‌షమెంట్ వంటి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు ప్రతి నెలా రూ.700 కోట్లను విడుదల చేస్తామని సర్కారు గత ఏడాది ప్రకటించింది. ఆ మేరకు 2025 ఆగస్టు నుంచి ప్రతి నెలా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తోంది. కానీ, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులకు అవి సరిపోవడం లేదని, నిధులు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి రూ.1000 కోట్ల చొప్పున విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఏప్రిల్‌కు సంబంధించిన రూ.1000 కోట్లను బుధవారం విడుదల చేశారు. ఈసారి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) బిల్లులను క్లియర్ చేయడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. 2025 అక్టోబరు నుంచి పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్ బిల్లులు క్లియర్ కానున్నాయి. కాగా, ఉద్యోగుల మెడికల్ బిల్లులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా ప్రాధాన్య క్రమంలో చెల్లించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. విద్యార్థుల స్కాలర్‌షి్‌పల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. విద్యా శాఖ అధికారులతో బుధవారం ప్రజాభవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. పేద విద్యార్థుల స్కాలర్‌షి్‌పల సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.