మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త
ABN , Publish Date - May 09 , 2026 | 06:53 AM
మహిళా సంఘాల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అర్హత కలిగిన ఎస్‌హెచ్‌జీలకు అందిస్తున్న రూ.5లక్షల వడ్డీలేని...
రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలు.. రూ.26,621కోట్ల బ్యాంక్ లింకేజీ రుణ లక్ష్యం
బ్యాంకు రుణాలకు డాక్యుమెంటేషన్,సర్వీస్ చార్జ్‌ల రద్దు
హైదరాబాద్, మే 7(ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అర్హత కలిగిన ఎస్‌హెచ్‌జీలకు అందిస్తున్న రూ.5లక్షల వడ్డీలేని రుణాల పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. రూ.10లక్షల వరకు మహిళా సంఘాలు తీసుకునే బ్యాంకు రుణాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా వారు తీసుకునే రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది రూ.2500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రణాళిక
ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.26,621.47కోట్ల రుణ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. మహిళల ఆర్థిక ప్రగతికి అండగా నిలుస్తూ 4.33 లక్షల సంఘాలకు ఈ ఏడాది రుణాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లోని 3.90 లక్షల సంఘాలకు రూ.20,536 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 43,307 సంఘాలకు రూ.6,085 కోట్లు కలిపి మొత్తం రూ.26,621.47 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ఎస్‌హెచ్‌జీలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను బ్యాంకులు చేరుకున్నాయి. మొత్తం రూ19,280.75 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా, బ్యాంకులు ఏకంగా రూ.19,447.53 కోట్లు అందించి, 100.86శాతం ప్రగతిని నమోదుచేశాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2026-27కు గాను రూ.26,621.47 కోట్ల రుణ లక్ష్యాన్ని సిద్ధం చేసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్) విభాగాలు వెల్లడించాయి. ఎస్‌హెచ్‌జీ రుణాలపై సర్వీస్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజులు, ఇతర హిడెన్ ఛార్జీలను రద్దు చేయాలని ప్రభుత్వం బ్యాంకులను కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.37లక్షల సంఘాల్లో 46.68 లక్షలమంది మహిళలను భాగస్వాములను చేశారు. గ్రామాల్లో 17,650 విలేజ్ ఆర్గనైజేషన్లు, 553 మండల సమాఖ్యలు, 32 జిల్లా సమాఖ్యలతో పటిష్టమైన నెట్‌వర్క్ ఏర్పడింది. వీఓ భవనాల నిర్మాణానికి కూడా ప్రాధాన్యమిస్తామని, సంఘ సభ్యులకు సొంతంగా పరిశ్రమలు, వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు రుణ సహాయం అందిస్తామని అధికారులు తెలిపారు. వడ్డీలేని రుణపథకం అమల్లో భాగంగా 2023 నుంచి ఇప్పటివరకు రూ.1,397.66కోట్ల వడ్డీ చెల్లించిన ప్రభుత్వం 48లక్షల పేదకుటుంబాలకు ప్రయోజనం చేకూర్చింది.